600 వికెట్లు సాధించిన అనితరసాధ్యుడు అండర్సన్‌

ఇంగ్లాండ్‌ పేస్‌ అండర్సన్‌ సాధించాడు.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఓ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.. టెస్ట్‌ల్లో 600 వికెట్లను తీసుకోవడం ద్వారా అరుదైన రికార్డును సాధించాడు.

600 వికెట్లు సాధించిన అనితరసాధ్యుడు అండర్సన్‌

Updated on: Aug 26, 2020 | 11:45 AM

ఇంగ్లాండ్‌ పేస్‌ అండర్సన్‌ సాధించాడు.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఓ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.. టెస్ట్‌ల్లో 600 వికెట్లను తీసుకోవడం ద్వారా అరుదైన రికార్డును సాధించాడు.. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లను, ఆస్ట్రేలియాకు చెందిన షేన్‌వార్న్‌ 708 వికెట్లను, మన దేశానికి చెందిన అనిల్‌కుంబ్లే 619 వికెట్లను తీసుకున్నా .. వారంతా స్పిన్నర్లు.. ఓ పేస్‌ బౌలర్‌ 600 వికెట్లు తీసుకోవడమన్నది అండర్సన్‌కే సాధ్యమయ్యింది.. పేస్‌ బౌలర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్‌ ఖాతాలో 563 వికెట్లు ఉన్నాయి.. అలాగే వెస్టిండీస్‌ బౌలర్‌ వాల్ష్‌ 519 వికెట్లు సాధించాడు.. కాకపోతే మెక్‌గ్రాత్‌ ఆడినవి 124 టెస్ట్‌లు అయితే ఆండర్సన్‌కు ఈ మైలురాయిని చేరుకోడానికి 156 టెస్టులు పట్టాయి.. మొన్నీమధ్యనే ఇంగ్లాండ్‌కే చెందిన బ్రాడ్‌ 500 వికెట్ల మైలురాయిని అధిగమించాడు.. సౌథాంప్టన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో అజహర్‌ అలీ వికెట్‌ తీసుకోవడం ద్వారా ఈ అనితరసాధ్యమైన ఫీట్‌ను సాధించి అండర్సన్‌ రికార్డుబుక్కుల్లోకి ఎక్కాడు.. ఇప్పటి వరకు 156 టెస్ట్‌లు ఆడిన అండర్సన్‌ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లను 29 సార్లు, టెస్ట్‌లో పది వికెట్లు మూడు సార్లు తీసుకున్నాడు.

తక్కువ బంతుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్లలో అండర్సన్‌ (33717 బంతులు) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో మురళీధరన్‌ (33711 బంతులు) ఉన్నాడు. మురళీధరన్‌తో పోలిస్తే కేవలం ఆరు బంతులే ఎక్కువ తీసుకున్నాడంతే.. ! నిజంగానే ఓ పేస్‌ బౌలర్‌ ఇంత సుదీర్ఘకాలం ఆడటమే గొప్ప.. అందులోనూ ఆరు వందల వికెట్లు తీసుకోవడం ఇంకా గొప్ప… మూడు దశాబ్దాల కిందట అయితే నాలుగు వందల వికెట్లు తీసుకుంటేనే అబ్బో అనేవారు.. ఈ ఘనతకు అండర్సన్‌ నూటికి నూరుశాతం అర్హుడు.. అతడి ఖాతాలో పడిన వికెట్లన్నీ గొప్పవే! అతడెప్పుడూ బౌలింగ్‌లో లైన్‌ అండ్ లెంగ్త్‌ మిస్సవ్వలేదు.. రివర్స్‌ స్వింగ్‌లో మళ్లీ రివర్స్‌ అనేది అండర్సన్‌కే సాధ్యం.. 2003లో జింబాబ్వేతో తొలి టెస్ట్‌ ఆడిన అండర్సన్‌ అందులో తొలి ఇన్నింగ్స్‌లోనే అయిదు వికెట్లు తీసుకున్నాడు.. అప్పుడెవరూ ఇతను 600 వికెట్లు తీసుకుంటాడని ఊహించలేదు.. ఇండియాపై ఆడిన 27 మ్యాచులలో 110 వికెట్లు తీసుకున్న ఆండర్సన్‌ ఆస్ట్రేలియాపై 104 వికెట్లు సాధించాడు.