త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విచిత్రాలు..రంగు మారుతున్న స‌ర‌స్సులెన్నో..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న ప్రాచీన లోనార్‌ సరస్సు ఒక్కసారిగా రంగు మార్చుకునేసరికి ఆశ్చర్యపోయాం.. పచ్చటి రంగులో ఉండే సరస్సు కాస్తా గులాబీరంగులోకి మారడం వింతే అనుకున్నాం...

త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విచిత్రాలు..రంగు మారుతున్న స‌ర‌స్సులెన్నో..

Edited By:

Updated on: Jun 13, 2020 | 12:12 PM

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న ప్రాచీన లోనార్‌ సరస్సు ఒక్కసారిగా రంగు మార్చుకునేసరికి ఆశ్చర్యపోయాం.. పచ్చటి రంగులో ఉండే సరస్సు కాస్తా గులాబీరంగులోకి మారడం వింతే అనుకున్నాం… ముంబయికి సుమారు 5 వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు ఓ 50 వేల ఏళ్ల కిందట ఉల్కాపాతం వల్ల ఏర్పడిన బిలంగా గుర్తించారు.. ఈ లోనార్‌ సరస్సు ఇలా రంగు మారడం ఇదేం మొదటిసారి కాదు.. లోనార్‌ బిలంలోని జీవవైవిధ్యం వల్లే ఇలా జరుగుతుందనేది పరిశోధకులు తేల్చేశారు.. ఆ సంగతి వదిలేస్తే ప్రపంచంలో ఇలా రంగులు మార్చుకునే తటాకాలు చాలానే ఉన్నాయి.. ఆ మాటకొస్తే రకరకాల రంగులతో కూడిన నదే ఉంది… కొలంబియాలోని సెరెనియా డిలా మెకెరెనా పర్వతశ్రేణి దగ్గరకు వెళితే అక్కడ సప్తవర్ణ శోభితమైన ఓ నదిని చూడవచ్చు.. ఆ నది పేరు కేనో క్రిస్టేల్స్‌… ఆ నదిని చూస్తే ఇంధ్రధనుస్సు నదిలో ప్రతిబింబిస్తుందా అన్న డౌట్‌ కూడా వచ్చేస్తుంది.. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఇంతకంటే అందమైన నది ఉండదేమో! అలాగని ఏడాది పొడవునా ఈ నది ఇలా రంగులు విరజిమ్మదు… దానికో లెక్క ఉంది.. ఓ నాలుగు నెలల పాటు నది వన్నెచిన్నెలు ఒలకబోస్తుంటుంది.. అలా ఎందుకూ అంటే… కొన్ని వేల సంవత్సరాల కిందట క్వార్జెట్‌ అనే రాయితో నది అడుగు భాగం ఏర్పడింది.. జులై చివరి వారం నుంచి నవంబర్‌ మధ్య కాలంలో ఈ రాయి మీద గులాబీ…నారింజ…ఆకుపచ్చ… పసుపు.. ఇంకా కొన్ని రంగుల్లో మెకెరెనియా క్లెవెజెరా అనే ఓ రకం నాచు పెరుగుతుంది.. వివిధ వర్ణాలలో ఉన్న నాచు మీద నుంచి నది ప్రవహించేటప్పుడు మనకు ఇలా రంగుల్లో కనిపిస్తుంది.. అందుకే ఈ నదిని ద్రవరూపంలో ఉన్న ఇంద్రధనుస్సుగా అంటే లిక్విడ్‌ రెయిన్‌బోగా నదిని పిల్చుకుంటారు.. అయిదు రంగుల్లో మిలమిలమని మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి రివర్‌ ఆఫ్‌ ఫైవ్‌ కలర్స్‌ అని కూడా అంటారు..

రంగుల నది సంగతి అలా ఉంచితే… సాధారణంగా సరస్సులన్నీ నీలిరంగులోనో.. నలుపురంగులోనో ఉంటాయి.. అదేం విచిత్రమో ఆస్ట్రేలియాలో ఓ సరస్సులోని నీరు మాత్రం మన లోనార్‌ సరస్సులాగే గులాబీరంగులో మెరిసిపోతుంటుంది.. సౌత్‌ ఆస్ట్రేలియాలోని మిడిల్‌ ఐల్యాండ్స్‌లో ఉందీ గులాబీ కొలను.. అసలు రెండు శతాబ్దాల కిందటి వరకు ఇక్కడో పింక్‌ సరస్సు ఉందని ఎవరికీ తెలియదు.. 1802 జనవరి నెలలో బ్రిటిష్‌ నావికుడు మాధ్యు ఫ్లిండర్స్‌ కంట పడిందీ సరస్సు.. ప్రపంచాన్ని చుట్టేద్దామంటూ బయలుదేరిన ఫ్లిండర్స్‌ టీమ్‌ నెలల తరబడి సముద్రంలోనే ప్రయాణించింది.. ఆస్ట్రేలియా దక్షిణ తీరానికి వచ్చేసరికి ప్రాణాలు లేచి వచ్చాయి.. నేల మీదకొచ్చిన వారికి ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు.. మనుష్యులెవరైనా కనిపిస్తారేమోనని దగ్గరే ఉన్న కొండనెక్కాడు ఫ్లిండర్‌.. కనీసం తాగడానికి మంచినీళ్లయినా దొరుకుతాయేమోనని చుట్టూ చూశాడు.. అప్పుడు కనిపించింది గులాబీరంగు సరస్సు.. హమ్మయ్య అనుకుంటూ సరస్సును చేరుకున్నాడు.. పింక్‌ కలర్‌లో ఉన్న సరస్సును చూసి ఆశ్చర్యపోయాడు.. .. నోట్లో గుక్కెడి నీళ్లు వేసుకున్నాడు.. అప్పుడు తెలిసింది అది మంచినీటి సరస్సు కాదని.. భయంకరమైన ఉప్పునీటి సరస్సని.. డెడ్‌ సీ కంటే ఈ సరస్సులోనే ఉప్పు సాంద్రత ఎక్కువని గ్రహించాడు.. నౌకయానంలోనే డిహైడ్రీషన్‌తో చనిపోయిన తన సహచరుడు విలియం హిల్లియర్‌ పేరును సరస్సుకు పెట్టేశాడు.. ఇక్కడో గులాబీరంగు తటాకం ఉందని ఫ్లిండర్స్‌ బృందం చెబితేగానీ ప్రపంచానికి తెలిసిరాలేదు.. ఆ అందమైన సరస్సును చూసేందుకు జనం క్యూలు కట్టడం మొదలు పెట్టారు.. కాలక్రమంలో అదో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది.. ఎరియల్‌ వ్యూలో మాత్రమే సరస్సు అందాన్ని వీక్షించగలం! అన్నట్టు ఉప్పునీటి సరస్సు కాబట్టి ఇందులో మనుషులు మునిగే ప్రసక్తే లేదు.. ఏ వస్తువూ మునగదు.. సరస్సులో తేలియాడుతూ పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ సరస్సులోని నీరు ఎందుకిలా గులాబీరంగులో ఉందన్న క్యూరియాసిటీ సహజంగానే శాస్ర్తవేత్తలకు కలిగింది.. వెంటనే పరిశోధన మొదలెట్టారు.. డుయినెల్లా సాలినా అనే ఓ రకం శిలీంద్రాలే దీనికి కారణమని తెలుసుకున్నారు. పింక్‌ కలర్‌లో ఉన్నప్పటికీ నీళ్లు మాత్రం స్వచ్ఛంగా ఉంటాయి..

ఆఫ్రికాలోని సెనెగల్‌లోనూ అచ్చంగా ఇలాంటి సరస్సే ఉంది.. ఇది కూడా గులాబీరంగుతో మిలమిలమంటుంది.. ఈ సరస్సు పేరు లేక్‌ రెట్‌బా… సెనెగల్‌ దేశస్తుల భాషలో గులాబీరంగు సరస్సు అని అర్థం.. ఈ సరస్సు కూడా ఉప్పనీటిదే! 40 శాతం లవణీయత ఉంటుంది..దేశ రాజధాని డకర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గులాబీవర్ణ తటాకం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.. అట్టాంటిక్‌ సముద్రం నుంచి వేరుపడిన ఈ సరస్సులోని నీరు ఇలా పింక్‌ కలర్‌లో ఉండటానికి డుయినెల్లా సాలినానే కారణం.. నవంబర్‌ నుంచి జూన్‌ మాసం వరకు ముదురు గులాబీ రంగులో ఉండే నీరు జులై నుంచి అక్టోబర్‌ వరకు లైట్‌ గులాబీరంగులో కనిపిస్తుంది. ఇందులో కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఈత కొట్టవచ్చు.. ఎందుకంటే మునగాలనుకున్నా మునగలేం కాబట్టి! అయినా ఎక్కువ సేపు ఈ నీటిలో ఉండటం కూడా ప్రమాదమే! ఇందులో ఉప్పు పంట పండించే వారు కూడా రోజుకు అయిదారు గంటల కంటే ఎక్కువ పని చేయరు. ఎక్కువ సేపు ఉంటే చర్మం పాడవుతుంది..

ఒక్కోసారి ఒక్కో రంగులో కనిపించే సరస్సు కూడా ఈ భూమ్మీద ఉంది.. బ్రిటిష్‌ కొలంబియాలో స్పాటెడ్‌లేక్‌గా పేరొందిన ఈ తటాకం ఓసారి నీలంరంగులో కనిపిస్తుంది.. మరోసారి ఆకుపచ్చరంగులో కనువిందు చేస్తుంది.. ఇంకోసారి పసుపువర్ణంలో మెరిసిపోతుంది.. ఇలా ఏడాది పొడవునా ఇది రంగులు మార్చుకుంటుంది.. సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సును చూసి పూర్వీకులు జడుసుకునేవారట! ఇప్పుడు కాదులే..! ఇప్పుడు భయం స్థానే భక్తి పుట్టుకొచ్చింది.. చుట్టుపక్కలవారు ఈ సరస్సును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. సరస్సు రంగులు మార్చడానికో కారణం ఉంది.. ఈ నీటిలో రకరకాల ఖనిజాలు అత్యధిక శాతాల్లో ఉన్నాయి.. ఆయా ఖనిజాల శాతానికి అనుగుణంగానే రకరకాల రంగులు కనిపిస్తాయి.. ఎండకాలంలో చాలామట్టుకు నీరు ఆవిరవుతుంది.. ఉన్న కాసింత నీరు బురదతో కలిసి ఇలా రంగురంగుల వలయాలుగా ఏర్పడుతుంది.. అక్కడున్న ఖనిజాలను బట్టి కలర్స్‌ మారుతుంటాయి.. అసలు ప్రపంచంలో ఖనిజాలు ఎక్కువగా ఉన్న సరస్సు ఇదేనట! ఈ సరస్సుకు స్పాటెడ్‌ లేక్‌ అన్న పేరు కూడా ఉంది.. స్థానిక ప్రజలు మాత్రం దీన్ని కిలుక్‌ అని పిల్చుకుంటారు.. ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మ రోగాలు మాయమవుతాయన్నది వీరి నమ్మకం.. ఏ మాత్రం నలతగా ఉన్నా సరస్సులో మునిగి తేలుతారు.. దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్‌కు బదులు ఈ నీటిని పూసుకుంటారు. – బాలు