ప్రస్తుతం సాంకేతికత (Technology) విపరీతంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం భారీగా ఉంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు. కరోనా ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం వీటి వినియోగం అమాంతం పెరిగిపోయిందని నిపుణలు చెబుతున్నారు. అయితే.. వీటి కొనుగోలు, వినియోగం విషయంలో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీటి ఛార్జర్ల (Chargers) విషయంలో తికమకపడుతుంటాం. ఎందుకంటే సెల్ ఫోన్లకు విడిగా ఛార్జర్లు, వాచ్ లకు ప్రత్యేక ఛార్జర్లు.. ఇలా వేటికవే ప్రత్యేకమైన ఛార్జర్లు ఉండటం వల్ల అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ ఒకటే ఛార్జర్ ఉంటే ఎంత బాగుండు.. అనే ఆలోచన మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వారి ఇబ్బందులు తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం ఛార్జర్‌ను కొనాల్సిన పరిస్థితిని తప్పించడంపై కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, వాచ్ లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు వంటి వివిధ గ్యాడ్జెట్లన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఈ అంశంపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న కేంద్రం సమావేశం కానుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి వివరాలు వెల్లడించారు. విస్తృతంగా ఉన్న చార్జర్ల వినియోగం ద్వారా ఈ–వ్యర్థాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. వినియోగదారులపై పడే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విషయాలను మదింపు చేసే విషయాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్‌బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.