మంత్రి అయిన మూడు రోజులకే రాజీనామా.. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి నిర్ణయం.. కారణం అదేనా..?

|

Nov 19, 2020 | 5:52 PM

బీహార్‌లో ఓ మంత్రికి తన పదవి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవినీతి ఆరోపణలు కావడంతో మూడు రోజులకే రాజీనామా చేశాడు.

మంత్రి అయిన మూడు రోజులకే రాజీనామా.. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి నిర్ణయం.. కారణం అదేనా..?
Follow us on

బీహార్‌లో ఓ మంత్రికి తన పదవి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవినీతి ఆరోపణలు కావడంతో మూడు రోజులకే రాజీనామా చేశాడు. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల కిందట బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మేవాలాల్‌ చౌదరికి విద్యా శాఖను కట్టబెట్టారు నితీష్. గతంలో ఆయన భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలో విద్యావంతుడైన మేవాలాల్ విద్యాశాఖ మంత్రి ప్రమాణం స్వీకారం చేశారు.

వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పనిచేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డట్లు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయి. అంతేకాదు, లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ఆర్జీడీతో సహా అన్ని పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్‌ అవినీతిపరులకు కేబినెట్‌లో చోటు కల్పించారంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఏద్దేవా చేశారు.

ఇదిలావుంటే, ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించడం, అది కాస్త వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికినట్లైంది. “పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా” కు బదులుగా “పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా” అని పాడటంతో ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ఆయనపై సెటైర్ల వర్షం గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో మేవాలాల్‌ చౌదరి తన పదవి రాజీనామా చేయడం గమనార్హం. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి అందజేశారు. కాగా, సాధారణ ఎమ్మల్యేగా ప్రజలకు సేవనంటూ మేవాలాల్ పేర్కొన్నారు.