#apcoronavirus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 66,778 నమూనాలను పరీక్షించగా 1,395 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 8,56,159కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 9 మంది ప్రాణాలను వదిలారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున.. అనంతపురం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,890కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,293 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 92,64,085 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.