Sankranti Festival: ఆకాశం రంగురంగుల పతంగులతో హరివిల్లులా మారే సందర్భం.. నింగి అంతా రెక్కలు లేని పక్షులతో నిండిపోయే సమయం.!

ఆకాశం రంగులద్దుకోడాన్ని మీరెప్పుడైనా చూశారా? తడవకో రంగు మార్చే నింగినెప్పుడైనా గమనించారా? పోనీ రెక్కలు లేని పక్షులను? చతురస్రాకారపు తోక చుక్కలను..

Sankranti Festival: ఆకాశం రంగురంగుల పతంగులతో హరివిల్లులా మారే సందర్భం.. నింగి అంతా రెక్కలు లేని పక్షులతో నిండిపోయే సమయం.!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 11, 2021 | 1:55 PM

ఆకాశం రంగులద్దుకోడాన్ని మీరెప్పుడైనా చూశారా? తడవకో రంగు మార్చే నింగినెప్పుడైనా గమనించారా? పోనీ రెక్కలు లేని పక్షులను? చతురస్రాకారపు తోక చుక్కలను? ఈ జనరేషన్‌కు అంతటి అదృష్టం.. ఆ అవకాశం లేదు కానీ.. ఓ మూడు నాలుగు దశాబ్దాల కిందట అయితే సంక్రాంతి రోజున నిజంగానే ఆకాశం రంగులద్దుకునేది.. అంగుళం కూడా ఖాళీ లేకుండా పతంగులు నింగిలో ఎగిరేవి.. మనం ఇప్పుడు సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బిల్లు, గంగిరెద్దులు, భోగి మంటలే అనుకుంటున్నాం కానీ.. సంక్రాంతి అంటే పతంగులు కూడా! హైదరాబాద్‌లో మాత్రం సంక్రాంతి అంటే పంతుగుల పండుగే! ఒకప్పుడైతే దీపావళి తర్వాతి నుంచే పతంగుల సందడి కనిపించేది.. సంక్రాంతి సెలవుల్లో అయితే ఇంకాస్త ఎక్కువ. పిల్లలేమిటి పెద్దలు కూడా మేడ దిగేవారు కాదు. ధనుర్మాసం లో వీచే తూర్పు గాలిని రైతులు తూర్పార పట్టడానికి వుపయోగిస్తే హైదరాబాద్‌లో మాత్రం గాలి పటాలు ఎగరేయడానికి ఉపయోగిస్తారు. మందంగా ఒకే ప్రతిపత్తిలో వీచే గాలి వల్ల కేవలం ఈ మాసంలోనే పతంగుల జోరు కనిపిస్తుంది. దక్షిణాయానం నుంచి ఉత్తరాయణం ప్రవేశించేటప్పుడు ఏర్పడే ధనుస్సంక్రమణం సమయంలో వెలువడే కిరణాలు కళ్లకు ఆరోగ్యదాయకమైనవి. అందుకే పతంగులను ఎగురవేస్తారు. అసలు పతంగులను ఎగరవేయడానికి ఇంతకు మించిన సీజన్‌ మరోటి వుండదేమో! ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌, కరాచి, లాహోర్‌లలో కూడా గాలిపటాలు గాల్లో ఎగురుతుంటాయి.

పతంగుల మధ్య రసవత్తరమైన పోరు సాగుతుంది. ఒక పతంగిని మరో పతంగి కోసే ప్రక్రియకు పేంచ్‌ అని పేరు.. పేంచ్‌ పడిందంటే పతంగుల మధ్య పోరు మొదలయ్యిందన్నమాటే! ఎవరు ఎన్ని పతంగులు కాట్‌ చేస్తే అంత గొప్ప. అందుకే మంచి మాంజాను వాడతారు. గాజు పొడిని అద్దిన దారాన్ని మాంజా అంటారు. రెండు పతంగులు ముడిపడిన తర్వాత దారం పదునును బట్టి ఏదో ఒకటి వెంటనే తెగిపోతుంది. పతంగులు, మంజాల తయారీలో గుల్జార్‌హౌజ్‌, పత్తర్‌గట్టి, మంగళ్‌హాట్‌ ఫేమస్‌. గుల్జార్‌హౌజ్‌లో ఉన్న జ్ఞానేశ్వర్‌ మాంజాకు, సికింద్రాబాద్‌లోని కింగ్స్‌వేలో ఉన్న పెంటయ్య మాంజాకు అప్పట్లో పెద్ద క్రేజ్‌! అక్కడ్నుంచి మాంజా కొనుక్కుని వస్తే అదో గొప్పగా ఫీలయ్యేవారు. ఇక్కడ తయారయ్యే గాలిపటాలు చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి అయ్యేవి. మాంజా తయారీలో మెత్తటి గాజు పొడి, కలబంద, అన్నం ముద్ద, కోడిగుడ్డు, బెండకాయ, కలర్‌ కోసం రంగును వాడతారు. సన్నటి దారంపై ఇవన్నీ కలగలిపిన ముద్దను పూస్తే మాంజా తయారవుతుంది. దీన్ని మాంజా సుతాయించడం అంటారు. మాంజాను గీటి లెక్కన కొలుస్తారు..ఒక్కో గీటి 45 మీటర్లు ఉంటుంది.. లచ్చాల లెక్క కూడా ఉంటుంది. లచ్చా అంటే బొటన వేలి నుంచి దారాన్ని చిటికిన వేలుకు చుట్టి మళ్లీ బొటనవేలి వరకు వెళ్లడం. ఎనిమిది అంకె షేపులో దారాన్ని చుడతారు. మాంజాలలో కూడా రకాలున్నాయి.. మోతీయా, గాజర్‌, గంధక్‌, ఫెరోజా, టీలా, కాశ్మీ, హరా, కాలా, అండేకా, రెడ్‌ రోజ్‌ ఇలా చాలా రకాలుంటాయి. గంధం మాంజా ఎక్కువగా డీల్‌కే ఉపయోగిస్తారు. ఒక్కోసారి పతంగ్‌ కాటవ్వడానికి చాలా సేపు పడుతుంది. ఇలాంటి వాటిని మొండి పేంచ్‌లంటారు. పేంచ్‌ పడ్డాక దారాన్ని వదులుతూ, లాగుతూ, మళ్లీ వదులుతూ… ఇలా చేయడాన్ని కీంచ్‌ అంటారు. దారాన్ని బలంగా లాగడమన్నమాట. అలా కాకుండా దారాన్ని నెమ్మదిగా వదులుతూ వెళితే డీల్‌ అంటారు. కొద్దిగా కరుకుగా ఉన్న మాంజాతో అయితే కీంచ్‌ బెటర్‌…! కొద్దిగా సాఫ్ట్‌గా ఉన్న మాంజాతో అయితే డీల్‌ ఉత్తమం! అవతలివారి పతంగిని కోసినప్పుడు ఆనందంతో అఫా అని, సఫా అని అరుస్తుంటారు కొందరు. క్యా కాటే అంటూ అరుస్తారు కూడా! ఎక్కడో ఉన్న పతంగికి పేంచ్‌ వేయాలంటే మన పతంగిని అక్కడి వరకు తీసుకెళ్లాలి. అప్పుడు పతంగిని రోక్‌ కొట్టించి , అంటే ఓ వైపుకు వంచి నెమ్మదిగా అక్కడి వరకు తీసుకెళ్లగలగాలి. ఇది కూడా టాలెంట్‌తో కూడిన విద్యే! యుద్ధంలో కొన్ని నియమాలు ఉన్నట్టుగానే పతంగుల పోరులో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. రెండు గాలిపటాలు తలపడుతున్నప్పుడు మూడో పతంగి తలదూర్చకూడదు. అలాగే పేంచ్‌ మాంజాలోనే వేయాలి తప్ప సాదా దారంలో వేయకూడదు. పేంచ్‌ మధ్యలో అవతలివారి పతంగిని మనం బలవంతంగా లాగేసుకుంటే దాన్ని అత్తంబాజీ అంటారు.. సాధారణంగా ఇలాంటివి మొండి పేంచ్‌లలో ఎదురవుతుంటాయి.. ఎంతకీ పోరు ముగియకపోతే విసుగుతో గబగబ పతంగిని లాగేసుకుంటాం. అలాంటప్పుడు అవతలివారి పతంగి కూడా మన పతంగితో వచ్చేస్తుంది.. అత్తంబాజీ వల్ల ఒక్కోసారి గొడవలయ్యే ప్రమాదం కూడా ఉంది.. అలాగే పతంగి తెలిపోయి గాల్లో ఎగురుకుంటూ పోతున్నప్పుడు ఆ పతంగిని మన పతంగి ఆధీనంలో తెచ్చుకుంటే దాన్ని లప్టాయించడం అంటారు. కొందరు లుప్టాయించడమని కూడా అంటారు. అన్నట్టు ఒక్కోసారి పతంగి మన చేతి దగ్గర నుంచి తెగిపోతుంది.. అలాంటప్పుడు దాన్ని ఉక్డాయించిందని అంటారు.. అందుకే దారానికి ముళ్లు జాగ్రత్తగా వేయాలి.. పతంగులు ఎగరేసేటప్పుడు ఒక్కోసారి అవి చెట్లకు, స్తంభాలకు తట్టుకుంటాయి. కర్రకందితే తీసుకోవచ్చు. లేకపోతే మాత్రం దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి … ఆ రాయిని పతంగి దారంపై విసిరి లాగుతారు. రాయిని కట్టిన దారాన్ని లండోరి అంటారు. పతంగుల సీజన్‌లో.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు మేడ మీద గోందు (బంక), గోందు లేకపోతే అన్నం, రంగు కాగితం కంపల్సరీ. ఎందుకంటే చినిగిపోయిన పతంగిని అంటించాలి కదా! పతంగికి ఉన్న నిలువుబద్ద విరిగిపోతే దానికి బీడి సపోర్ట్‌గా పెట్టేవారు!

సంక్రాంతికైతే పతంగుల పోటీ మాజోరుగా వుంటుంది. తెల్లవారిందంటే చాలు డాబాల మీద మైక్‌ సెట్లు సిద్ధం. ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎవరి పతంగిని ఎవరు కోసారు? ఆవన్నీ మైకుల్లో రన్నింగ్‌ కామెంటరీ వుండేది. మధ్యమధ్యలో పాటలు. అవతలివారి పతంగి కోసినప్పుడు అరుపులు కేకలు, డాన్సులు. పతంగుల్లో బోలెడన్ని రకాలున్నాయి. కడీకంప్‌, గోల్‌ కంప్‌ , అద్దా, పౌండ్‌, ఆదాపౌండ్‌, డోరాడార్‌, జీబ్యా, లంగోట్‌, లైంగా లంగోట్‌, జీబ్యా లంగోట్‌, జీబ్యా లైంగా లంగోట్‌, గుడ్డీ లంగోట్‌, గుడ్లందార్‌, నామందార్‌, పట్టిదార్‌, టోపీదార్‌, నామమ్‌దార్‌, రోటీదార్‌, షీషల్‌దార్‌, చొప్పన్‌, పచ్‌పన్‌, అదారోటీ, పచ్చీస్‌, గిల్లోరా. ఇవన్నీ పతంగుల పేర్లే! కడీకంప్‌ నిటారుగా ఎగిరితే, గోల్‌కాంప్‌ ఎగురవేసే వారి ఆధీనంలో వుండి ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. గోల్‌కంప్‌ చాలా ఫెరోషియస్‌గా వుంటుంది. కడీకంప్‌ పతంగి పాపం సాధుస్వభావి.. దాన్ని ఎగరేసిన తర్వాత మనం దారాన్ని దేనికో ఓదానికి కట్టేసి చక్కగా లంచ్‌ చేసి రావచ్చు. అప్పటి వరకు అది గాల్లోనే ఎగురుతుంటుంది.. ఎవరూ దాని జోలికి రాకపోతేనే సుమా! పౌండ్‌ పతంగి చాలా బరువు.. దీన్ని ఎగరేయడం పిల్లలవల్ల కాదు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన పతంగిని దుల్హనియా పతంగి అంటారు.. ఇప్పుడీ పతంగులు లేవు. పేర్లూ లేవు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. అన్నట్టు పతంగులకు కన్నాలు కట్టడం కూడా ఓ ఆర్టే. ఆ కళ అందరికీ రాదు. ఎంతో రాటు తేలితే కానీ ఆ విద్య అబ్బదు. పతంగి ఎగరాలన్నా, అది మనం చెప్పినట్టు వినాలన్నా కన్నాలే ఆధారం. అవి సరిగ్గా కట్టకుంటే గాలి ఎంత బాగా వీచినా పతంగి ఎగరదు. మొండికేస్తుంది. కొత్తగా పతంగులు ఎగరేసేవారు బెత్తల లెక్కలు వేసుకుంటూ కన్నాలు కడతారు.. ఇక పతంగులను ఎగరేసేందుకు ముఖ్యమైన మరో వస్తువు చర్ఖా! ఇందులో దారం చుట్టడం కూడా ఓ కళే! చర్ఖాకు ముందు కాగితం చుడతారు.. ఆపై సాదా దారాన్ని చుడతారు.. అప్పట్లో మధుర కోట్స్‌, మోడత్రెడ్‌ దారం చాలా ఫేమస్‌.. 50 మీటర్లు, వంద మీటర్ల రీల్‌ దొరికేది.. దీన్ని కెయిట్‌ దారం అనేవారు! పతంగుల సమరాంగణంలో విజయపు ఘనత పతంగి ఎగరేసేవాడికి ఎంత ఉంటుందో . చర్ఖా పట్టుకునేవాడికి కూడా అంతే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రథి పతంగి ఎగరేసేవాడైతే, సారథి చర్ఖా పట్టుకున్నవాడన్నమాట! పేంచ్‌ సమయంలో చర్ఖా పట్టుకున్నవాడు ఏ మాత్రం తత్తరపాటుపడినా పతంగి కాట్‌ అవుతుంది.. చాలా అలెర్ట్‌గా ఉండాలి.. మన పతంగి కాట్‌ అయినప్పుడు దారాన్ని చాలా స్పీడ్‌గా చుట్టాలి. పతంగి ఎగరేసే వాళ్లు చేతి వేళ్లకు టేపును చుట్టుకోవడమో, కుట్టు మిషన్‌లో ఉండే బాబిన్‌ను వేలికి తొడుక్కోవడమో చేస్తారు. లేకపోతే వేళ్లను మాంజా కోసేస్తుంది. ఇక కూలింగ్‌గ్లాస్‌ మస్టు!

మన హైదరాబాద్‌లో ఇబ్రహీం కులికుతుబ్‌షా కాలం నుంచే పతంగుల పండుగ ప్రారంభమయ్యింది.. కుతుబ్‌షాహీల తర్వాత వచ్చిన అసిఫ్‌జాహీలు కూడా పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల కిందటి వరకు పాతబస్తీలో పతంగుల పోటీ జరిగేది. విజేతలకు బహుమతులు కూడా ఇచ్చేవారు. ఈ గాలిపటాల పండుగ కేవలం మన దేశంలోనే కాదు… ఆసియా ఖండంలో చాలా దేశాల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. పాకిస్తాన్‌లో జోరుగా వుంటుంది. అప్పట్లో లాహోర్‌ ప్రాంత వాసులు ఢిల్లీకి వచ్చి పతంగులు, దానికి సంబంధించిన సామాగ్రిని కొనుక్కుని వెళ్లేవారు. క్రికెటర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అప్పట్లో జహీర్‌ అబ్బాస్‌ అయితే ఢిల్లీ నుంచే గాలిపటాలు కొనుక్కుని వెళ్లేవాడు. చైనా, మలేషియా వంటి దేశాల్లో సరిగ్గా ఈ సీజన్‌లోనే గాలిపటాలు ఎగురుతాయి. అహ్మదాబాద్‌లో అయితే సంక్రాంతికి కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి గాలిపటాల ప్రేమికులు ఇందులో పాల్గొంటారు. దీనికి 120 ఏళ్ల చరిత్ర వుంది. అహ్మదాబాద్‌లోని ఢిల్లీ దర్వాజలో శతాబ్దాలుగా పతంగుల మార్కెట్‌ వుంది. పాకిస్తాన్‌లో ఏడో దశకం మధ్యలో అయితే పెద్ద జాతరలా వుండేది. పతంగులు ఎగురవేస్తూ ప్రమాదానికి గురైన వారు ఎక్కువ కావడంతో యాహ్యాఖాన్‌ పతంగులను నిషేధించాడు. అయితే జనాగ్రహానికి తలవొగ్గి తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహించుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడైతే సంక్రాంతికి తప్పనిసరిగా మద్రాస్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ జరిగేది. మ్యాచ్‌ సందర్భంగా చెపాక్‌ స్టేడియంపైన ఆకాశమంతా పతంగులే కనబడేవి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్‌లో పతంగులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెంట్‌ స్తంభాల జోలికి వెళ్లకుండా, మేడ చివరన ఎగరేయకుండా… చేతి వేళ్లు కోసుకోకుండా ప్రమాదాలకు దూరంగా వుంటే… సంక్రాంతి సంబరమవుతుంది. గాలిపటాలు గాల్లో రివ్వున ఎగురుతాయి.

క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలోనే గ్రీకులు గాలిపటాలను ఎగరేసారనడానికి ఆధారాలున్నాయి…కానీ చైనీయులే మొదటిసారిగా పతంగులను ఎగరేశారని చరిత్ర చెబుతోంది. చైనా వారు పతంగులను ఎగరేయడమే కాకుండా వాటి సాయంతో శత్రు సైన్యాలను భయపెట్టేవారట! వందలాది పతంగులను ఒకేసారి ఎగరవేయడంతో అవి చేసే పెద్ద పెద్ద శబ్దాలకు శత్రు సైన్యాలు భయపడి పారిపోయేవట! మన దేశానికి మాత్రం ఆసియా నుంచే గాలిపటాలు వలస వచ్చాయి.. అంతే కాదు..ఒకప్పుడు ప్రేమ సందేశాలకు పతంగులనే నమ్ముకునేవారట! మొగలు పాలకుల కాలంలో గాలి పటాల ప్రభావం ఉచ్చస్థితికి చేరుకుంది. యువరాజులు, రాజకుమార్తెలు, పాదుషాలు, వారి భార్యలు అందరూ పతంగుల పోటీల్లో పాల్గొనేవారు. ఢిల్లీని పాలించిన షా ఆలమ్‌, అతని వంశీకులు పతంగుల క్రీడలో ప్రవీణులుగా పేరుపొందారు. ప్రపంచంలో అతి పెద్ద గాలిపటం జపాన్‌లో తయారైంది. 1936లో తయారు చేసిన ఈ గాలిపటం బరువు తొమ్మదిన్నర టన్నులు. మహానుభావులు ఏ దారంలో ఎగరేసి వుంటారో! ఎంత మంది సాయం అవసరమైందో మరి! జపాన్‌లో పతంగులు చిత్ర విచిత్రాకారంలో వుంటాయి.. చేప, డ్రాగన్‌, సీతాకోక చిలుక, పిచ్చుక, నెమలి, గద్ద, దేవత ..ఇలా రకరకాల ఆకారాల్లో పతంగులను తయారుచేస్తారు…ఇప్పుడివి మన నగరానికి కూడా వచ్చాయి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు