ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు ఊరిస్తున్నాయి..!

| Edited By: Anil kumar poka

Nov 10, 2020 | 11:34 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 ఎడిషన్‌ విజేత ఎవరో ఇంకొన్ని గంటలలో తెలిసిపోతుంది.. 13వ సీజన్‌ టైటిల్‌ను ముంబాయి ఇండియన్స్‌ ఎగరేసుకుపోతారా? ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కుతుందా అని తేలిపోయే సమయం ఆసన్నమయ్యింది..

ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు ఊరిస్తున్నాయి..!
Follow us on

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 ఎడిషన్‌ విజేత ఎవరో ఇంకొన్ని గంటలలో తెలిసిపోతుంది.. 13వ సీజన్‌ టైటిల్‌ను ముంబాయి ఇండియన్స్‌ ఎగరేసుకుపోతారా? ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కుతుందా అని తేలిపోయే సమయం ఆసన్నమయ్యింది.. టైటిల్‌తో పాటు ఇరు జట్లలోని ఆటగాళ్లకు కొన్ని వ్యక్తిగత రికార్డులు కూడా ఊరిస్తున్నాయి.. ముంబాయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు టీ-20 లీగ్‌లలో ఇది 200వ మ్యాచ్‌.. ఇప్పటి వరకు 3,992 పరుగులు చేసిన రోహిత్‌ మరో ఎనిమిది పరుగులు చేసి నాలుగువేల పరుగుల మైలురాయిని చేరుకోవాలని అనుకుంటున్నాడు.. ఇక ఇదే టీమ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌కు కూడా ఓ రికార్డు దగ్గరలో ఉంది.. అతడు రెండు సిక్సర్లు కొడితే టీ-20 లీగ్‌లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మరో 36 పరుగులు చేస్తే టీ-20 లీగ్‌లో 1500 పరుగులు చేసిన వాడవుతాడు.. ఇప్పటి వరకు ధావన్‌ 1,464 పరుగులు చేశాడు.. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు చేసిన ధావన్‌ అత్యధిక పరుగులు చేయడానికి సిద్ధమవుతున్నాడు.. ఇంకో 68 పరుగులు చేస్తే పంజాబ్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ చేసిన 670 పరుగులను అధిగమించవచ్చు.. అన్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా ఓ రికార్డు ఊరిస్తోంది.. ఇతను మరో 46 పరుగులు చేసి ఈ సీజన్‌లో 500 పరుగులు చేసిన ప్లేయర్‌ అవుతాడు.. ఇక దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియం ముంబాయి ఇండియన్స్‌కు పెద్దగా అచ్చొచ్చిందేమీ కాదు.. ఈ గ్రౌండ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో గెలిచినవి కేవలం రెండే మ్యాచ్‌లు.. అయిదు మ్యాచ్‌లలో ఓటమి చెందింది.. అలాగని ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా ఏమీ లేదు.. ఇందులో పది మ్యాచ్‌లు ఆడితే అయిదింటిలో విజయం సాధించింది.. అయిదింటిలో ఓడిపోయింది.. ఐపీఎల్‌లో ముంబాయి ఇండియన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు 27 సార్లు తలపడ్డాయి.. ఇందులో ముంబాయి ఇండియన్స్‌ 15 సార్లు విజయం సాధిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచ్‌లలో గెలిచింది.. ఇక ఈ సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లూ ముంబాయి వశమయ్యాయి..