
ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ సంప్రదాయాలే కాదు.. వింత నిబంధనల వల్ల కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి దేశాల్లో స్విట్జర్లాండ్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ.. సమాజంలో నిశ్శబ్ద జీవనం అత్యంత ప్రాధాన్యమైన అంశాలు. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్ లోని కొన్నిచోట్ల రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదనే ఒక ప్రత్యేక నియమం అమలులో ఉంది.
స్విస్ ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉండే జీవనశైలిని అనుసరిస్తారు. రాత్రి సమయంలో అతి స్వల్ప శబ్దం కూడా ఇతరులను అసౌకర్యానికి గురిచేయవచ్చు. ముఖ్యంగా పాత భవనాలలో గోడలు చాలా సార్లు పలుచగా ఉండటంతో.. టాయిలెట్ ఫ్లష్ చేసే శబ్దం పెద్దగా వినిపిస్తుంది. ఈ శబ్దం పొరుగువారి నిద్రను భంగం చేస్తుందని భావిస్తూ.. కొన్ని అపార్ట్ మెంట్ యాజమాన్యాలు తమ భవనాల్లో రాత్రి 10 తర్వాత ఫ్లష్ చేయడం నిషేధిస్తున్నారు.
ఈ నిబంధనను స్విస్ ప్రభుత్వం చట్టంగా తీసుకురాలేదు అనే విషయం స్పష్టంగా గుర్తించాలి. ఇది Hausordnung అనే ఇంటి నియమావళిలో భాగంగా ఉంటుంది. అంటే ప్రతి అపార్ట్ మెంట్ యాజమాన్యం తమ భవనానికి ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు తయారు చేస్తారు. ఇవి అద్దె ఒప్పందంలో కూడా చేర్చబడతాయి. ఇవి ఖచ్చితంగా చట్టబద్ధమైనవి కాకపోయినా.. పాటించకపోతే సామాజిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ నియమాలు సామాజిక పరంగా చాలా ముఖ్యం.
ఇది చట్టబద్ధమైన అంశం కాదని చెప్పాలి. అంటే ఒకే గదిలో ఎక్కువ మంది నివసిస్తున్నారని చెప్పి పెద్దగా జరిమానాలు వేయలేరు. అయితే అపార్ట్ మెంట్ లో ఉండే నియమాలు ఉల్లంఘిస్తే యజమాని నుండి హెచ్చరికలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది పొరుగువారితో ఒప్పందాలు, సంబంధాలు చెడిపోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్ సంస్కృతిలో పరస్పర గౌరవం, నిశ్శబ్దత, వ్యక్తిగత ప్రైవసీకి చాలా ప్రాధాన్యతనిస్తారు.
స్విట్జర్లాండ్ లో హోమ్ స్టే లేదా అద్దె అపార్ట్ మెంట్ లో నివసించే పర్యాటకులు.. ముందు నుంచే తమ వసతి ప్రదేశానికి సంబంధించిన హౌస్ రూల్స్ తెలుసుకోవడం మంచిది. ఒక్క టాయిలెట్ ఫ్లష్ వల్ల చట్టపరమైన చర్యలు తీసుకోరు కానీ పొరుగువారి నుంచి అసహనం వ్యక్తం కావచ్చు. ఇది మీ పర్యటనలో అనవసరమైన ఇబ్బందులకు దారి తీయవచ్చు.
స్విట్జర్లాండ్ లో రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదన్న నిబంధన అధికారికంగా చట్టంగా లేకపోయినా.. అక్కడి సంప్రదాయం, జీవనశైలిని గౌరవించాలన్న నిబంధనగా ఇది పరిగణించబడుతుంది. పరిశుభ్రత, మర్యాద, ఇతరుల కోసం తగిన గౌరవం చూపించడం అనే విలువలు అక్కడి సంస్కృతిలో ప్రాథమిక అంశాలుగా ఉంటాయి. మీరు స్విట్జర్లాండ్ కు పర్యటన కోసం వెళ్లినా.. అక్కడ అద్దెకు నివసిస్తున్నా.. అక్కడి ఇంటి నియమాలను గౌరవించటం మీ బాధ్యత. చుట్టుపక్కల నివసించే వారికి అసౌకర్యం కలగకుండా ఉండాలి.