సముద్రం నీరు ఉప్పగా.. నది నీరు తియ్యగా ఎందుకుంటుంది..? ప్రకృతిలో జరిగే అద్భుతం ఇదే..

అనంతమైన నీరు.. కళ్లెదుటే కనిపిస్తున్నా తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరాని పరిస్థితి. అవును.. సముద్రం అంటేనే ఉప్పు నీటి భాండాగారం. మరి అదే సముద్రంలోకి వచ్చి చేరే నదులు మాత్రం ఎంతో తియ్యగా, స్వచ్ఛంగా ఎందుకు ఉంటాయి? నదుల ప్రయాణం చివరకు సముద్రాన్ని ఎందుకు ఉప్పగా మారుస్తోంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సముద్రం నీరు ఉప్పగా.. నది నీరు తియ్యగా ఎందుకుంటుంది..? ప్రకృతిలో జరిగే అద్భుతం ఇదే..
Why Is Ocean Water Salty

Updated on: Feb 22, 2026 | 3:22 PM

భూమిపై మూడొంతుల నీరు ఉన్నప్పటికీ, అందులో అత్యధిక భాగం తాగడానికి పనికిరాదు. సముద్రపు నీరు అనంతంగా ఉన్నా.. అది ఉప్పగా ఉండటమే అందుకు కారణం. అదే సమయంలో నదుల నీరు మాత్రం ఎంతో రుచికరంగా, తీయగా ఉంటుంది. అసలు ప్రకృతిలో ఈ వ్యత్యాసం ఎందుకు ఏర్పడింది? అంటే సైన్స్ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంది. మనకు వర్షం ద్వారా లభించే నీరు పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. వర్షపు చుక్కలు ఆకాశం నుండి నేలకు రాలే క్రమంలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. దీనివల్ల ఆ నీరు స్వల్పంగా ఆమ్లత్వాన్ని పొందుతుంది. ఈ నీరు భూమిపై పడినప్పుడు, నేలలోని మట్టిని, రాళ్లను నెమ్మదిగా కరిగిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని రాక్ వెదరింగ్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో రాళ్లలో ఉండే సోడియం, క్లోరైడ్ వంటి ఖనిజాలు విచ్ఛిన్నమై నీటిలో కలుస్తాయి. మనకు తెలిసిన సాధారణ ఉప్పు ఏర్పడటానికి ఇవే ప్రధాన కారకాలు. ఈ ఖనిజాలతో కూడిన నీరే నదుల ద్వారా ప్రవహించి చివరకు సముద్రానికి చేరుకుంటుంది.

నది నీరు ఎందుకు తీయగా ఉంటుంది?

నిజానికి నది నీటిలో కూడా కొంత మొత్తంలో ఉప్పు ఉంటుంది. కానీ నదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అవి నీటిని ఒకే చోట నిల్వ చేయవు. ప్రతి నిమిషం కొత్త నీరు వచ్చి చేరుతుండటం వల్ల, అందులో లవణాల సాంద్రత పెరగదు. అందుకే మనకు నది నీరు తీయగా అనిపిస్తుంది.

సముద్రం ఎందుకు ఉప్పగా మారుతుంది?

సముద్రం అనేది నదులన్నింటికీ చివరి గమ్యస్థానం. లక్షల సంవత్సరాలుగా నదులు మోసుకొచ్చిన ఖనిజాలన్నీ సముద్రంలోనే పేరుకుపోతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రకృతి ప్రక్రియ జరుగుతుంది. సూర్యుని వేడికి సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారుతుంది. నీరు మాత్రమే ఆవిరై పైకి వెళ్తుంది తప్ప, అందులోని ఉప్పు, ఖనిజాలు సముద్రంలోనే ఉండిపోతాయి. ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతుండటంతో, సముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా పెరిగిపోయింది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

శాస్త్రీయ లెక్కల ప్రకారం.. సముద్రపు నీటిలో లవణీయత సగటున 3.5శాతం ఉంటుంది. అంటే ఒక కిలో సముద్రపు నీటిలో సుమారు 35 గ్రాముల ఉప్పు కరిగి ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ జల చక్రం వల్లనే సముద్రాలు ఉప్పు బాండాగారాలుగా మారాయి. ఇది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు భూమిపై జీవరాశి మనుగడకు అవసరమైన సహజ సమతుల్యతలో ఒక భాగం.

Follow Us