
కోడి గుడ్లను మనం సాధారణంగా డజన్లలో లెక్కిస్తుంటాం. ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రెండు ఆసక్తికరమైన కారణాలున్నాయి. మొదటి కారణం చారిత్రకమైనది. గుడ్లను డజన్లలో లెక్కించే పద్ధతి ఇంగ్లాండ్‌లో మొదలైంది. అప్పట్లో ఇంగ్లాండ్‌లో ఇంపీరియల్ యూనిట్ సిస్టం అమలులో ఉండేది. ఈ విధానంలో, 12 పెన్నీలు కలిపితే ఒక షిల్లింగ్ అయ్యేది. ఒక గుడ్డును ఒక పెన్నీకి అమ్మేవారు కాబట్టి, ఒక షిల్లింగ్ చెల్లించి సులభంగా 12 గుడ్లను కొనుక్కునేవారు. అలా 12 గుడ్లను కొనడం అనేది ఒక అలవాటుగా మారింది.
ప్రస్తుతం ఆ కరెన్సీ చలామణిలో లేకపోయినా, గుడ్లను డజన్లలో కొనే పద్ధతి మాత్రం అలాగే కొనసాగుతోంది. కోడి గుడ్లను డజన్‌గా కొనుగోలు చేయడానికి మరో కారణం కూడా ఉంది. 12 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని రెండు, మూడు లేదా నాలుగు భాగాలుగా సులభంగా విభజించవచ్చు.
12 అనే సంఖ్యకు ఉన్న ప్రత్యేకతే ఇందుకు కారణమని అంటారు. ఎందుకంటే 12ని రెండు భాగాలుగా (6+6), మూడు భాగాలుగా (4+4+4), అలాగే నాలుగు భాగాలుగా (3+3+3+3) సులభంగా విభజించవచ్చు. అందువల్ల ఇంట్లో ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్నా గుడ్లను సమానంగా పంచుకోవడం చాలా సులభంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి కోడి గుడ్లను డజన్లలో లెక్కించే పద్ధతి మాత్రం బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు ఇలాగే కొనసాగుతోంది.