
ఒకనాడు.. దారి కాచి దోపిడీ చేసేవాళ్లు. దండయాత్రలు చేసి కొల్లగొట్టేవాళ్లు. ఇళ్లల్లో పడి దోచుకెళ్లే వాళ్లు. తరువాత.. ట్రెండ్‌కు తగ్గట్టుగా డెబిట్‌కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు.. లేటెస్ట్‌గా యూపీఐలతో మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే.. మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. పీకమీద కత్తిపెట్టరు. ఆయుధాలతో బెదిరించరు. మీ ఇంటికి రారు.. నగానట్రా దోచుకెళ్లరు. జస్ట్.. ముచ్చెమటలు పట్టించి కోట్లు కొట్టేస్తారు. ఎదుటి వాళ్లను ఉన్నచోటే ఉంచి.. వాళ్ల అకౌంట్లలోని డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. దానికంటే ముందు డిజిటల్ అరెస్ట్ చేస్తారు. ఈమధ్య బాగా పాప్యులర్ అయిన క్రైమ్.. ఈ ‘డిజిటల్ అరెస్ట్’. ఒక్కో డిజిటల్ అరెస్ట్‌ది ఒక్కో స్టోరీ. వింటే.. ఔరా అనాల్సిందే. అలా ఉంటాయవి. ఇంతకీ, ఎలా చేస్తారీ డిజిటల్ అరెస్ట్..? భయం. భయమే నేరగాళ్ల పెట్టుబడి. అది కూడా ఎలాంటి భయం చూపిస్తారో తెలుసా. ఎమోషన్స్‌తో ముడిపెట్టి భయపెడతారు. ఓ రియల్ ఇన్సిడెంట్ చెబుతా వినండి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న మాల్తీ వర్మ అనే మహిళకు ఓ వీడియో కాల్ వచ్చింది. ‘మీ కూతురు వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.. ప్రస్తుతం జైల్లో ఉంది’ అంటూ కాల్ చేశారు. కన్నకూతురుపై ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఆ క్షణంలో ఆలోచన కోల్పోతారనుకుంటా. ‘ఏమో చేయని తప్పుకు ఇలా ఇరికిస్తున్నారేమో.. అక్రమంగా కేసులు పెడుతున్నారేమో.. అందుకే జైల్లో పెట్టారేమో’ అని క్షణకాలంలోనే ఇన్ని ప్రశ్నలూ వెంటాడుతుంటాయి. పైగా ఒక తల్లికి ఇంతకంటే...