
మంచు కొండల మధ్య గుంపులు గుంపులుగా నిలబడి, ఒకరికొకరు భుజాలు రాసుకుంటూ, గుసగుసలాడుకుంటున్నట్లు మెల్లగా కదిలే పెంగ్విన్‌లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ మొదటి చూపుకు ఎంతో ముద్దుగా అనిపించే ఈ పెంగ్విన్‌ల గుంపుల వెనుక కేవలం స్నేహమో, సరదాలో లేవు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫానులను ఎదుర్కొని ప్రాణాలతో బతికి బట్టకట్టేందుకు అవి చేసే అత్యంత అద్భుతమైన యుద్ధ తంత్రం దాగి ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కంటే పడిపోయి.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అత్యంత శీతల గాలులు ఉండే అంటార్కిటికా శీతాకాలంలో పెంగ్విన్‌లు ఎలా జీవిస్తాయో చాలా మందికి తెలియదు.
పెంగ్విన్లు ఒకరికొకరు అంత దగ్గరగా అతుక్కుని నిలబడటాన్ని సైన్స్ భాషలో హడ్లింగ్ అంటారు. ఇలా భుజం భుజం కలిపి నిలబడటం వల్ల వాటి శరీరాల నుంచి వెలువడే వేడి బయటకు పోకుండా ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఈ గుంపు మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత బయటి వాతావరణం కంటే ఎంతో వెచ్చగా మారుతుంది. ఇది అత్యంత శీతల గాలుల నుండి వాటిని కాపాడుతుంది. చాలా జంతువులు చలికాలం తట్టుకోలేక సురక్షిత ప్రాంతాలకు వలసపోతే ఎంపరర్ పెంగ్విన్‌లు మాత్రం అత్యంత కఠినమైన శీతాకాలంలోనే గుడ్లు పెడతాయి. తీవ్రమైన మంచు తుఫానులు కమ్ముకొచ్చే ఈ సుదీర్ఘ సంతానోత్పత్తి కాలంలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఈ హడ్లింగ్ పద్ధతి వీటికి ఎంతో అవసరం.
మగ ఎంపరర్ పెంగ్విన్‌లు గుడ్లను పొదిగే సమయంలో దాదాపు రెండు నెలల పాటు అసలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటాయి. ఈ సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ఎక్కువ శక్తి ఖర్చయితే అవి చనిపోతాయి. అందుకే గుంపుగా చేరడం ద్వారా అవి తమ శరీర శక్తిని భారీగా ఆదా చేసుకుంటాయి. ఆడ పెంగ్విన్‌లు సముద్రం నుంచి ఆహారంతో తిరిగి వచ్చే వరకు మగ పెంగ్విన్‌లు ప్రాణాలతో ఉండటానికి ఈ వ్యూహమే కారణం.
పెంగ్విన్ల గుంపులో మధ్య భాగం ఎంతో వెచ్చగా ఉంటుంది. అయితే ఆ వెచ్చని స్థలం కోసం అవి గొడవపడవు. గుంపులోని పెంగ్విన్‌లు నిరంతరం నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. బయటి చివరన ఉండి చలికి తట్టుకునే పెంగ్విన్‌లు మెల్లగా మధ్యలోకి వెళ్తుంటాయి. లోపల వెచ్చగా ఉన్నవి క్రమంగా బయటకు వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్క పెంగ్విన్‌కు మధ్యలోకి వెళ్లే సమాన అవకాశం దక్కుతుంది.
మగ పెంగ్విన్‌లు తమ కాళ్లపై ఒకే ఒక్క గుడ్డును ఉంచుకుని, వాటి పొట్ట కింద ఉండే వెచ్చని చర్మంతో కప్పి ఉంచుతాయి. పొరపాటున ఆ గుడ్డు క్షణకాలం పాటు కింద ఉన్న మంచును తాకినా లోపల ఉన్న పిల్ల చనిపోతుంది. అందుకే గుంపుగా చేరి నిలబడటం ద్వారా మగ పెంగ్విన్‌లు గుడ్లకు, పుట్టిన పిల్లలకు స్థిరమైన వెచ్చదనాన్ని అందిస్తాయి.
ఎంపరర్ పెంగ్విన్‌లతో పాటు కింగ్ పెంగ్విన్‌లు మాత్రమే ఇలా గుంపులుగా చలిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ గాలాపగోస్, ఆఫ్రికన్, లిటిల్ బ్లూ పెంగ్విన్‌లు వంటి కొంచెం వెచ్చని ప్రాంతాలలో నివసించే జాతులు ఇలాంటి పెద్ద పెద్ద హడిల్స్ చేయవు. ఎందుకంటే వాటికి అంటార్కిటికా లాంటి భయంకరమైన శీతల వాతావరణం ఎదురుకాదు.