ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెతికినా కనిపించవు..! ట్రాఫిక్ జామ్ సమస్యా లేదు..

మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ప్రపంచంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా రోడ్లపై వాహనాల రాకపోకలను ఊహించలేం. కానీ మన పొరుగు దేశంలో మాత్రం ఒక్క ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు. అయినప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్‌లు దాదాపు కనిపించవు. చేతి సంకేతాలతో ట్రాఫిక్ నియంత్రణ, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ సంస్కృతి, పక్కా రోడ్ల రూపకల్పనే దీనికి ప్రధాన కారణాలు.

ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెతికినా కనిపించవు..! ట్రాఫిక్ జామ్ సమస్యా లేదు..
No Traffic Signals In Bhutan

Updated on: Jul 22, 2026 | 3:45 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఒక్క సిగ్నల్ పనిచేయకపోయినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. కానీ, మన పొరుగునే ఉన్న ఒక చిన్న దేశంలో దీనికి భిన్నమైన వాతావరణం ఉంది. ఆ దేశంలో అసలు ఒక్క ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా కనిపించదు. విచిత్రమేమిటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యే కూడా ఉండదు! ఆ దేశమే భూటాన్. మరి ఇది ఆ దేశానికి ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం రండి..

భూటాన్ రాజధాని థింఫూ (Thimphu) సహా ఆ దేశవ్యాప్తంగా ఎక్కడా ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్లు ఉండవు. దీనికి బదులుగా ప్రత్యేక శిక్షణ పొందిన ట్రాఫిక్ పోలీసులు రోడ్ కూడళ్లలో నిలబడి చేతి సంకేతాల ద్వారా వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు. వాస్తవానికి 1990లో థింఫూలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే నగరజనం ఈ పద్ధతిని పెద్దగా ఇష్టపడలేదు. మునుపటిలాగా ట్రాఫిక్ పోలీసుల చేతి సైగల ద్వారా ట్రాఫిక్ నియంత్రణే నగర అందానికి, సంస్కృతికి తగినట్లుగా ఉందని నగర ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ యాంత్రికమైన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వెంటనే తొలగించారు.

భూటాన్‌లో ఎలా సాధ్యం..?

భూటాన్ దేశ జనాభా కేవలం 8 లక్షలు మాత్రమే. ఆ దేశ రాజధాని థింఫూలో నివసించేవారి సంఖ్య సుమారు 1.41 లక్షల మంది మాత్రమే. జనాభా తక్కువ కావడంతో అక్కడ వాహనాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. భూటాన్‌లో వాహనదారులు అనవసరంగా హారన్ వేయరు. ఎంతో ప్రశాంతంగా, ఓపికగా వాహనాలను డ్రైవ్ చేయడం అక్కడి వారికి బాగా అలవాటు. అక్కడ పాదచారులకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కాలినడకన రోడ్డు దాటే వారిని చూస్తే వాహనాలను వెంటనే నిలుపుతారు.

ఇవి కూడా చదవండి

భూటాన్‌లో రోడ్లు, జంక్షన్లను చాలా పక్కా ప్రణాళికతో డిజైన్ చేశారు. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగిపోకుండా నెమ్మదిగా ముందుకు సాగిపోతుంటాయి. భూటాన్‌లో ఎక్కువ భాగం కొండ ప్రాంతాలు కావడం వల్ల వాహనాలు సహజంగానే తక్కువ వేగంతో వెళ్తాయి. అధిక వేగం, హారన్ హడావిడి డ్రైవింగ్‌కు అక్కడ పెద్దగా అవకాశం ఉండదు. ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడాన్ని అక్కడి పౌరుడు బాధ్యతగా భావిస్తారు. పోలీసులు, వాహనదారులు, పాదచారులు పరస్పర సహకారంతో వ్యవహరించడం వల్ల ట్రాఫిక్ నిర్వహణ సులభంగా జరుగుతుంది.

అత్యాధునికి ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ లేకపోయినా..క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ సంస్కృతి ఉంటే ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించవచ్చని భూటాన్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ప్రజల భాగస్వామ్యం, ప్రశాంతమైన డ్రైవింగ్ సంస్కృతి ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు యంత్రాల అవసరం లేదని భూటాన్ నిరూపిస్తోంది.

Follow Us