AIకే సవాల్ విసురుతున్న 16 ఏళ్ల బాల మేధావి.. 9 గిన్నిస్ రికార్డులు, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్!

కృత్రిమ మేధస్సు (AI) క్షణాల్లో సంక్లిష్టమైన లెక్కలను పూర్తి చేస్తోంది. కానీ మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఆర్యన్ శుక్లా మాత్రం ఎలాంటి కంప్యూటర్, కాలిక్యులేటర్ సహాయం లేకుండానే అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను తన మెదడుతోనే పరిష్కరిస్తున్నాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడంతో పాటు, రెండుసార్లు మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు.

AIకే సవాల్ విసురుతున్న 16 ఏళ్ల బాల మేధావి.. 9 గిన్నిస్ రికార్డులు, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్!
Aryan Shukla Guinness World Records

Updated on: Oct 30, 2026 | 10:15 AM

నాసిక్: కృత్రిమ మేధస్సు (AI) క్షణాల్లో సంక్లిష్టమైన లెక్కలను పూర్తి చేస్తోంది. కానీ మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఆర్యన్ శుక్లా మాత్రం ఎలాంటి కంప్యూటర్, కాలిక్యులేటర్ సహాయం లేకుండానే అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను తన మెదడుతోనే పరిష్కరిస్తున్నాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడంతో పాటు, రెండుసార్లు మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. దీంతో అతడిని భారతదేశపు ‘హ్యూమన్ కాలిక్యులేటర్’గా పిలుస్తున్నారు.

ఆరేళ్ల వయసులోనే మొదలైన ప్రయాణం

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఆర్యన్‌కు చిన్నప్పటి నుంచే సంఖ్యలంటే ఎంతో ఆసక్తి. ఆరేళ్ల వయసులో మానసిక గణిత సాధన ప్రారంభించాడు. అతడిలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు నితిన్ శుక్లా, అతడి తల్లి ప్రోత్సహించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసక్తికి అనుగుణంగా సాధన చేసేందుకు సహకరించారు. 2018లో ఎనిమిదేళ్ల వయసులో ఇస్తాంబుల్‌లో జరిగిన టర్కీ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్నాడు. ఈ పోటీలో ఏడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటాడు.

12 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్

2022 జూలైలో జర్మనీలోని పాడర్‌బోర్న్‌లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో ఆర్యన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 40 మంది పోటీదారులను అధిగమించి, కేవలం 12 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 2024 సెప్టెంబర్‌లో జరిగిన పోటీల్లో 900 పాయింట్లకు 819.84 పాయింట్లు సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కూడిక, గుణకారం, వర్గమూలాలు, క్యాలెండర్ గణనలతో పాటు పలు విభాగాల్లో రాణించాడు.

తొమ్మిది గిన్నిస్ రికార్డులు ఎలా సాధించాడు?

2024 ఫిబ్రవరిలో ఇటలీ టెలివిజన్ షోలో పాల్గొన్న ఆర్యన్ తన తొలి గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. 50 ఐదు అంకెల సంఖ్యలను కేవలం 25.19 సెకన్లలో మానసికంగా కూడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఏడాది డిసెంబర్ 4న దుబాయ్‌లో ఒకే రోజు ఆరు గిన్నిస్ రికార్డులు సాధించాడు. 50 ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో, 100 నాలుగు అంకెల సంఖ్యలను 30.9 సెకన్లలో, 200 నాలుగు అంకెల సంఖ్యలను 1 నిమిషం 9.68 సెకన్లలో కూడాడు. పెద్ద సంఖ్యల భాగహారం, గుణకారంలోనూ రికార్డులు నెలకొల్పాడు. 2026 ఏప్రిల్‌లో ఇటలీలో మరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించాడు. 10 ఎనిమిది అంకెల సంఖ్యల వర్గమూలాలను 71.22 సెకన్లలో లెక్కించగా, మరో విభాగంలో 10 అంకెల సంఖ్యలను ఐదు అంకెల సంఖ్యలతో 10 సార్లు కేవలం 28.81 సెకన్లలో భాగించాడు.

చదువులోనూ టాపర్.. భవిష్యత్తు లక్ష్యం

రికార్డులు, అంతర్జాతీయ పోటీలతో బిజీగా ఉన్నప్పటికీ ఆర్యన్ చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. నాసిక్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మార్కులు సాధించాడు. గణితం, భౌతికశాస్త్రంతో పాటు ఏఐ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం యువతకు మానసిక గణితంపై అవగాహన కల్పిస్తూ, తన నైపుణ్యాలను ఇతర విద్యార్థులకు నేర్పిస్తున్నాడు. గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగానూ కొనసాగుతున్నాడు. 2025లో గ్లోబల్ మెంటల్ కాలిక్యులేషన్ లీగ్ సీజన్-3లో విజేతగా నిలిచాడు. అదే ఏడాది రియాద్‌లో జరిగిన మిస్క్ గ్లోబల్ ఫోరమ్‌లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాడు.

పిల్లలపై విజయాల కోసం ఒత్తిడి చేయకుండా, వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని ఆర్యన్ తండ్రి నితిన్ శుక్లా అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల కలలను పిల్లలపై రుద్దకూడదని ఆయన సూచిస్తున్నారు. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధిస్తున్న ఆర్యన్ ప్రయాణం దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, సాధనతో మానవ మేధస్సు సాధించగల అద్భుతాలకు ఆర్యన్ ఒక నిదర్శనంగా నిలుస్తున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us