Amol Kohli : నువ్వు తోపువి బాస్! ఒకప్పుడు అంట్లు కడిగాడు.. ఇప్పుడు రెస్టారెంట్ల సామ్రాజ్యాధిపతి!

రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా చేరినప్పుడు అమోల్ కోహ్లీకి కేవలం 15 ఏళ్లు. తన జేబు ఖర్చుల కోసం డిష్‌లు కడిగిన ఆ యువకుడు, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, తాను పనిచేసిన ఆ రెస్టారెంట్ చైన్ మొత్తానికి యజమాని అయ్యాడు. డిష్‌వాషర్ స్థాయి నుండి 250 రెస్టారెంట్ల సామ్రాజ్యాధినేత స్థాయికి కోహ్లీ ప్రయాణం... పట్టుదల, దార్శనికత, అపారమైన కృషికి నిదర్శనం. ఆయన కేవలం ఒక బ్రాండ్‌ను మాత్రమే కాదు, దాని మాతృ సంస్థతో పాటు మరో ఆరు ఫుడ్ బ్రాండ్‌లను కూడా కొనుగోలు చేశారు.

Amol Kohli : నువ్వు తోపువి బాస్! ఒకప్పుడు అంట్లు కడిగాడు.. ఇప్పుడు రెస్టారెంట్ల సామ్రాజ్యాధిపతి!
Amol Kohli Real Story

Updated on: Nov 04, 2025 | 6:01 PM

పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత స్థానికైనా చేరుకోవచ్చని నిరూపించారు భారత సంతతికి చెందిన అమోల్ కోహ్లీ. కేవలం 15 ఏళ్ల వయసులో ఫిలడెల్ఫియాలోని ‘ఫ్రెండ్లీస్’ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా డిష్‌లు కడిగిన ఆయన, రెండు దశాబ్దాల తర్వాత అదే సంస్థకు పూర్తి యజమాని అయ్యారు.

రూ. 5 డాలర్ల జీతం నుంచి:

2003లో కోహ్లీ ఫ్రెండ్లీస్ రెస్టారెంట్‌లో గంటకు 5 డాలర్ల చొప్పున సంపాదించారు. ఆయన కుక్, డిష్‌వాషర్, సర్వర్, ఐస్ క్రీమ్ స్కూపర్‌గా వివిధ పనులు చేసేవారు. డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్, మార్కెటింగ్ కోర్సులు చదివే సమయంలో కూడా, కోహ్లీ వారానికి ఐదు నుంచి ఆరు రోజులు రెస్టారెంట్‌లో పని చేస్తూ వ్యాపార రహస్యాలు తెలుసుకున్నారు. “నగదు రిజిస్టర్‌లో డబ్బు పడ్డాక ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ఇన్సూరెన్స్, పేరోల్, ఆహార ఖర్చుల గురించి చదువుకునే రోజుల్లోనే నేర్చుకున్నాను” అని కోహ్లీ తెలిపారు.

మేనేజర్ నుంచి ఫ్రాంఛైజ్ యజమాని వరకు:

2011లో గౌరవాలతో పట్టభద్రులయ్యాక, ఆయన ఫైనాన్స్ కెరీర్‌ను వదులుకుని ఫ్రెండ్లీస్‌లో రీజనల్ మేనేజర్‌గా చేరారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక ఫ్రాంఛైజ్ మూసివేస్తున్నప్పుడు, కోహ్లీ ధైర్యం చేసి తన పొదుపు, క్రెడిట్, స్నేహితుల నిధులతో దానిని కొనుగోలు చేసి, తిరిగి తెరిచారు. అదే ఆయన ఫ్రాంఛైజింగ్ ప్రస్థానానికి నాంది పలికింది. క్రమంగా అది 31 ఫ్రెండ్లీస్ అవుట్‌లెట్‌లకు పెరిగింది.

చైన్ మొత్తాన్ని కొనుగోలు:

2020లో మహమ్మారి కారణంగా ఫ్రెండ్లీస్ దివాలా తీసింది. 2021లో డల్లాస్ కేంద్రంగా గల బ్రిక్స్ హోల్డింగ్స్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది. మే 2025లో, కోహ్లీ సొంతంగా లెగసీ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ అనే పెట్టుబడి సంస్థను స్థాపించి, ఏకంగా బ్రిక్స్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేశారు.

ఈ కొనుగోలులో ఫ్రెండ్లీస్‌తో పాటు క్లీన్ జ్యూస్, ఆరెంజ్ లీఫ్, రెడ్ మ్యాంగో, స్మూతీ ఫ్యాక్టరీ + కిచెన్, సౌపర్ సలాడ్, హంబుల్ డోనట్ కో వంటి ఆరు ఇతర ప్రముఖ ఆహార బ్రాండ్‌లు ఉన్నాయి. వీటితో కలిపి అమెరికా వ్యాప్తంగా ఆయన పోర్ట్‌ఫోలియో 250కి పైగా రెస్టారెంట్లకు చేరింది. “సరైన వ్యక్తుల సహకారం, నమ్మకం, అదృష్టం కలిసి రావటం వల్లే ఇది సాధ్యమైంది” అని కోహ్లీ వివరించారు.

భవిష్యత్తు లక్ష్యం:

వేయికి పైగా అవుట్‌లెట్‌లు కలిగి ఉన్న ఫ్రెండ్లీస్ ఇప్పుడు వందకు పైగా మాత్రమే నడుస్తోంది. దీనిని ఆధునీకరణ, టెక్నాలజీతో పునరుజ్జీవింపజేయాలనేది కోహ్లీ లక్ష్యం. ముఖ్యంగా, ఫుడ్, హాస్పిటాలిటీ రంగాన్ని ఒక గొప్ప కెరీర్ మార్గంగా ఎంచుకోవాలని ఆయన కొత్త తరానికి స్ఫూర్తినిస్తున్నారు. “నా ఎగ్జిక్యూటివ్ టీమ్‌లోని కొందరు కూడా ఒకప్పుడు డిష్‌వాషర్లు, కుక్‌లుగా పనిచేసినవారే. ఈ పరిశ్రమలో కింది స్థాయి నుంచి సీఈఓ స్థాయికి ఎదగవచ్చు” అని కోహ్లీ తెలిపారు.