
పెంపుడు కుక్కలను చూసుకోవడంలో మనం చాలా శ్రద్ధ పెడతాం. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటాం. ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని విషయాల్లో మనకు సరైన అవగాహన లేకపోతే.. అవి మన కుక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి ముఖ్యమైన నాలుగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పెంపుడు కుక్క ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటిని క్రమం తప్పకుండా వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. జబ్బు వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ ను కలవడం సరైన పద్ధతి కాదు. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడమే మంచిది.
లీష్ వాడకపోతే కుక్కలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అవసరం లేనంత బిగుతుగా లీష్ వేస్తే అవి అసౌకర్యంగా ఫీలవుతాయి. వాటికి స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇవ్వడం ద్వారా అవి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాయి. లీష్ వాడటం కేవలం భద్రత కోసం మాత్రమే కాదు.. అవి సంతోషంగా ఉండేందుకు కూడా ఇది అవసరం.
కుక్కల శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. వాటి మానసిక స్థితి కూడా అంతే ముఖ్యం. వాటిని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడం, సరిగా ఆడుకోకపోవడం లాంటివి.. వాటికి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వాటికి ప్రేమ, సమయం, మానసిక ఉత్తేజం ఇవ్వడం అవసరం.
ఇంట్లో పెంచే కొన్ని మొక్కలు మనకు అందంగా కనిపించినా.. అవి జంతువులకు ప్రమాదకరమైనవి కావచ్చు. కొన్ని రకాల పువ్వులు, ఆకులు కుక్కలు తింటే విష ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నప్పుడు.. మీ గార్డెన్ లో ఉన్న మొక్కలు వాటి ఆరోగ్యానికి హాని కలిగించవని నిర్ధారించుకోవాలి.
పెంపుడు జంతువులు మన కుటుంబ సభ్యులతో సమానం. వాటి శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల పూర్తిగా బాధ్యతగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు కూడా వాటి జీవితంపై చెడు ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రేమతో పాటు అవగాహన కూడా పెంపుడు కుక్కలను చూసుకోవడంలో చాలా ముఖ్యం.