
తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక నిర్దిష్టమైన అంతర్జాతీయ విధానం ఉంది. దీని ద్వారానే తుఫాన్లను సులభంగా గుర్తించడంతో పాటు, ప్రజలకు వాతావరణ హెచ్చరికలను జారీ చేస్తారు. అయితే ప్రాంతాలను బట్టి తుఫాన్ల పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచంలోని వివిధ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు.. ఉత్తర అట్లాంటిక్, ఈశాన్య పసిఫిక్ ప్రాంతాల్లో ఏర్పడే తుఫాన్లన, హరికేన్లు అని, వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లను టైఫూన్లు అని పిలుస్తారు. ఇక హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లో ఏర్పడే తుఫాన్లను సైక్లోన్లు అని పిలుస్తారు.
తుఫాన్లకు ఎప్పటి నుంచి పేర్లు పెడుతున్నారు
ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లకు పేర్లు పెట్టే విధానాన్ని అట్లాంటిక్ ప్రాంతంలో తొలుత 1950లో స్టార్ట్ చేశారు. 1953 నుంచి అమెరికాలో హరికేన్లకు మహిళల పేర్లను ఉపయోగించే విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఇక మన దేశం చుట్టుపక్కల ఉన్న బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టే విధానాన్ని 2004 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ విధానాన్ని రూపొందించడంలో ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిషన్ (ESCAP) కీలక పాత్ర పోషించాయి.
2004లో 8 దేశాలతో ప్రారంభమైన నామకరణ విధానం
2004లో ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం ప్రారంభమైనప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. తుఫాన్‌కు పెట్టబోయే పేర్లలో ఒక్కో దేశం ఎనిమిది పేర్ల చొప్పున ప్రతిపాదించాయి. దీంతో మొత్తం 64 పేర్లతో తొలి జాబితా రూపొందించారు. ఈ పేర్లను బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు నిర్ణీత క్రమంలో పెట్టాలని నిర్ణయించారు. ఫణి, తిత్లీ వంటి పేర్లు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. 2020 మే వచ్చిన అంఫాన్ తుఫాన్ పేరుతోనే 2004లో రూపొందించిన పాత జాబితాలోని పేర్లు పూర్తయ్యాయి.
ప్రస్తుతం 13 దేశాలు.. 169 తుఫాన్ల పేర్లు
ఇక పాత జాబితాలోని పేర్లు పూర్తవడంతో తాజాగా కొత్త జాబితాను రూపొందించాల్సిన వచ్చింది. అయితే 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ దేశాలు ఈ జాబితాలోని చేరాయి. దీంతో మొత్తం సభ్య దేశాల సంఖ్య 13కు చేరింది. ఈ దేశాలు కూడా ఒక్కొక్కటి 13 పేర్ల చొప్పున ప్రతిపాదించడంతో మొత్తం 169 పేర్లతో కొత్త జాబితా రెడీ అయింది. ఈ జాబితాను 2020లో ఆమోదించి, అమల్లోకి తీసుకొచ్చారు. ఈ 169 పేర్లను 13 నిలువు వరుసలుగా విభజించారు. ప్రతి దేశం సూచించిన పేర్లు ఆయా దేశాల పేర్లకు అనుగుణంగా నిర్దిష్ట క్రమంలో ఉంటాయి. తుఫాన్లకు పేర్లు పెట్టేటప్పుడు ఈ జాబితాలోని పేర్లను వరుసగా ఉపయోగిస్తారు.
తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం ఎలా ఉంటుంది?
అయితే బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే ప్రతి అల్పపీడనానికి తుఫాన్ పేరు పెట్టరు. ఆది వాయుగుండగా బలపడి.. తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉంటే మాత్రమే పేరు కేటాయిస్తారు. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ బాధ్యతను భారత వాతావరణ శాఖ (IMD)లోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం (RSMC), న్యూఢిల్లీ నిర్వహిస్తుంది. గరిష్ఠంగా నిరంతర గాలుల వేగం గంటకు కనీసం 62 కిలోమీటర్లకు చేరినప్పుడు, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తుఫాన్‌కు పేరు కేటాయిస్తారు. కొత్త జాబితాలో దేశాల పేర్లను అక్షర క్రమంలో అమర్చారు. ప్రతి వరుసలోని పేర్లను క్రమంగా ఉపయోగిస్తారు. ఒక తుఫాన్‌కు కేటాయించిన పేరును మళ్లీ మరో తుఫాన్‌కు ఉపయోగించరు. జాబితాలోని పేర్లు పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగుతుంది.
పేర్ల ఎంపికలో పాటించే నియమాలు ఏమిటి?
సాధారణంగా తుఫాన్లకు పేర్లు పెట్టేటప్పుడు కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పాటిచాలి. ప్రతిపాదించే పేరు రాజకీయాలు, మతం, సంస్కృతి, లింగం వంటి అంశాల విషయంలో తటస్థంగా ఉండాలి. ప్రపంచంలోని ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి. అలాగే అపేరు అభ్యంతరంగా ఉండకూడదు. పలకడానికి కూడా ఈజీగా ఉండాలి. అంతేకాదు తుఫాన్ పేరు 8 అక్షరాలు దాటకూడదు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని పేర్లను తిరస్కరించే అధికారం సంబంధిత ప్యానెల్‌కు ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.