అండమాన్ జైలు డిజైన్ వెనుక బ్రిటీషర్ల భయంకర స్కెచ్.. కాలాపానీ నరకంలో దాగున్న చీకటి నిజాలివే..
భారత స్వాతంత్ర్య పోరాటంలో కాలాపానీ శిక్ష విధిస్తే బతికి రావడం అసాధ్యమనేవారు. కానీ అండమాన్ సెల్యులార్ జైలులో ఖైదీలను చంపింది శారీరక హింస మాత్రమే కాదు.. బ్రిటిష్ వాళ్లు వేసిన ఒక భయంకరమైన ఇంజనీరింగ్ ప్లాన్. ఎదుటి మనిషిని చూడకుండా, కనీసం తోటి మనిషి మాట కూడా వినపడకుండా ఖైదీలకు పిచ్చెక్కించేలా ఈ జైలును ఎలా డిజైన్ చేశారో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కాలాపానీ అనే మాట వింటేనే ఆనాడు ఒళ్లు గగుర్పొడిచేది. స్వాతంత్ర్య సమరయోధులను శారీరకంగానే కాకుండా మానసికంగా పూర్తిగా కుంగదీసేందుకు బ్రిటిష్ పాలకులు నిర్మించిన నరకకూపమే అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు. 1896లో నిర్మాణం ప్రారంభించి 1906 నాటికి పూర్తి చేసిన ఈ కారాగారం కేవలం గోడలతో కూడిన భవనం మాత్రమే కాదు.. మానవ మేధస్సును సైతానులా మార్చి వేసిన ఒక క్రూరమైన ఆర్కిటెక్చర్ డిజైన్. సెల్యులార్ జైలు రూపకల్పన బ్రిటిష్ తత్వవేత్త జెరెమీ బెంథమ్ ప్రతిపాదించిన పనోప్టికాన్ నమూనా ఆధారంగా జరిగింది. ఈ జైలును ఒక పెద్ద సైకిల్ చక్రంలా తీర్చిదిద్దారు. సరిగ్గా మధ్యలో ఒక ఎత్తైన సెంట్రల్ వాచ్ టవర్ ఉంటుంది. ఆ టవర్ నుండి చుట్టూ 7 విభాగాలు రేఖాగణిత రీతిలో విస్తరించి ఉంటాయి. సెంట్రల్ టవర్లో నిలబడే ఒక్క కాపలాదారుడు మొత్తం ఏడు విభాగాల మీదా ఏకకాలంలో నిఘా ఉంచేలా ఈ నమూనాను రూపొందించారు. అయితే ఖైదీలు మాత్రం కాపలాదారుడ్ని చూడలేరు.
ఒకరి ముఖం మరొకరు చూడలేని క్రూరమైన నిర్మాణం
ఈ జైలులో మొత్తం 696 చీకటి సెల్స్ ఉన్నాయి. అందుకే దీనికి సెల్యులార్ జైలు అనే పేరు వచ్చింది. ఇందులో అత్యంత భయంకరమైన ఇంజనీరింగ్ ప్లాన్ ఏమిటంటే.. ఏ ఒక్క గది ముఖద్వారం కూడా ఎదురుగా ఉండే మరో గదికి అభిముఖంగా ఉండదు. ఒక విభాగంలోని గదులన్నీ తెరుచుకునే వైపు.. ఎదురుగా ఉండే వింగ్ యొక్క ఖాళీ వెనుక గోడ మాత్రమే కనిపిస్తుంది. పక్క గదిలో ఉన్న వ్యక్తితో మాట్లాడటం అటుంచితే, పక్కన అసలు ఎవరున్నారో కూడా చూసే అవకాశం లేని విధంగా ప్రతి గదిని 13.5 x 7.5 అడుగుల విస్తీర్ణంలో కేవలం 3 మీటర్ల ఎత్తులో ఒక చిన్న వెంటిలేటర్తో నిర్మించారు.
ఒంటరితనంతో పిచ్చెక్కిపోయేలా సైకలాజికల్ టార్చర్
శారీరక హింస కంటే మానసిక ఒంటరితనమే మనిషిని త్వరగా చంపేస్తుందని బ్రిటిష్ పాలకులు విశ్వసించారు. భారత విప్లవకారులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా, అభిప్రాయాలు పంచుకోకుండా పూర్తిగా నిరోధించడమే ఈ డిజైన్ ప్రధాన లక్ష్యం. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా తోటి మనిషి గొంతు కూడా వినపడకుండా ఏళ్ల తరబడి ఒంటరిగా గడపడం వల్ల ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు మానసిక సమతుల్యత కోల్పోయి పిచ్చివాళ్లు అయ్యేవారు. కొందరు ఆ నరకయాతన భరించలేక ప్రాణాలు వదిలారు.
గోడల మధ్య తప్పించుకోలేని సముద్ర బంధనం
ఈ జైలు నుంచి ఎవరైనా తప్పించుకున్నా బ్రతకడం అసాధ్యం. చుట్టూ వేల మైళ్ల మేర విస్తరించి ఉన్న హిందూ మహాసముద్రం, సొరచేపలు, దట్టమైన అడవులు ఉండటంతో పారిపోవాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా ఉండేందుకు బ్రిటిష్ వారు అండమాన్ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఆవరణ గోడలు దాటినా మరణం తప్పని స్థితి అది. స్వాతంత్రోద్యమంలో వీర్ సావర్కర్, బటుకేశ్వర్ దత్ వంటి ఎందరో యోధులు ఈ రాతి గోడల మధ్యే బ్రిటిష్ వారి అమానుష హింసను భరిస్తూ దేశం కోసం సర్వస్వం త్యాగం చేశారు. బ్రిటిష్ వాళ్ళు అత్యంత పకడ్బందీగా వేసిన ఆ వికృత డిజైన్ స్కెచ్.. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా, నేటికీ ఆనాటి త్యాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
