Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ప్రాణాలను రక్షిస్తుంది. చాలా మంది నిర్లక్ష్యం చేసే 10 ముఖ్యమైన క్యాన్సర్ లక్షణాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. బరువు తగ్గడం, జ్వరం, అలసట, చర్మ మార్పులు వంటివి ఈ సంకేతాలలో కొన్ని. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..
Cancer

Updated on: Mar 01, 2026 | 10:53 PM

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా విజయవంతమైన చికిత్సకు అవకాశాలు పెరుగుతాయి. చాలా మంది సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేసే కొన్ని లక్షణాలు వాస్తవానికి క్యాన్సర్ తొలి సంకేతాలు కావచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించిన ప్రకారం, ప్రజలు తరచుగా పట్టించుకోని 10 రకాల క్యాన్సర్ లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం, సకాలంలో వైద్య సలహా తీసుకోవడం ప్రాణాలను కాపాడుతుంది.

1. అకస్మాత్తుగా బరువు తగ్గడం: క్యాన్సర్ సోకిన వారిలో చాలా మంది ఐదు కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు అకస్మాత్తుగా తగ్గిపోతుంటారు. ప్యాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తులు మరియు అన్నవాహిక క్యాన్సర్లలో ఇది సాధారణంగా కనిపిస్తుంది.

2. తరచుగా జ్వరం: క్యాన్సర్ పుట్టిన తర్వాత లేదా ఇతర అవయవాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం సాధారణంగా వస్తుంది. క్యాన్సర్ చికిత్సలు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం వల్ల కూడా జ్వరం వస్తుంటుంది.

3. అలసట: విశ్రాంతి తీసుకున్నప్పటికీ తగ్గని అలసట క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటుంది. పెద్దపేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమై అలసటను కలిగిస్తాయి.

4. చర్మ మార్పులు:చర్మం రంగులో మార్పులు, ముఖ్యంగా నల్లగా మారడం (హైపర్‌పిగ్మెంటేషన్), పసుపు పచ్చగా మారడం (జాండిస్), ఎర్రబడటం, దురద రావడం వంటివి చర్మ క్యాన్సర్లు లేదా ఇతర క్యాన్సర్లకు సంకేతాలు కావచ్చు.

5. మల, మూత్ర విసర్జనలో మార్పులు: ఎక్కువ కాలం పాటు మలబద్ధకం, డయేరియా లేదా మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన చేయాలనిపించడం లేదా తక్కువగా మూత్రం రావడం బ్లాడర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సూచిస్తాయి.

6. తగ్గని పుండ్లు లేదా గాయాలు: పుట్టుమచ్చలు పెరిగి రక్తం కారడం చర్మ క్యాన్సర్‌కు సంకేతం. నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టి పెట్టాలి. నోటి క్యాన్సర్ వల్ల నోటిలో పుండు త్వరగా మానదు. జననాంగాలపై పుండ్లు కూడా క్యాన్సర్ తొలిదశకు సంకేతం కావచ్చు.

7. అసాధారణ రక్తస్రావం: మలంలో రక్తం పడితే అది పెద్దపేగు క్యాన్సర్ లేదా మలద్వార క్యాన్సర్‌కు సంకేతం. గర్భాశయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కావచ్చు. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం. రొమ్ము క్యాన్సర్ లక్షణాలలో చనుమొనల నుంచి రక్తం కారడం ఒకటి.

8.శరీరంలో గడ్డలు లేదా గట్టిపడటం: చర్మంలో, రొమ్ముల్లో, వృషణాల్లో, గ్రంధుల్లో లేదా కణజాలాల్లో అసాధారణంగా గట్టిపడటం లేదా గడ్డలు ఏర్పడటం క్యాన్సర్ సంకేతం కావచ్చు.

9. మింగడంలో ఇబ్బంది: ఆహారాన్ని లేదా నీటిని మింగడంలో ఇబ్బందులు అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్ లేదా గొంతు క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు.

10.దీర్ఘకాలిక దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం: మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్‌కు గొంతు బొంగురుపోవడం ఒక లక్షణంగా ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు కేవలం క్యాన్సర్‌కు మాత్రమే సంబంధించినవి కాకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సంకేతాలు కనిపించవచ్చు. అయితే, ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.

Follow Us