
సాధారణంగా మన రోజువారీ అలవాట్లలో కొన్నిటి గురించి బహిరంగంగా చర్చ జరగడం తక్కువే. అలాంటి విషయాల్లో టాయిలెట్ (మరుగుదొడ్డి) వినియోగం ఒకటి. ఈ విషయంలో కేవలం సరైన సమయానికి మలవిసర్జనకు వెళ్లడం.. టాయిలెట్లో ఎక్కువ సమయం గడపకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. టాయిలెట్లో ఫోన్లు చూస్తూ 10 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారం వద్ద రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటారు. అయితే మారుతున్న కాలానుగుణంగా ఆధునిక జీవనశైలిలో భాగంగా మనం కూర్చునే పద్ధతి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తున్నారు.
మలవిసర్జన ప్రక్రియ వెనుక సంక్లిష్టమైన శరీర ధర్మశాస్త్రం దాగి ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మలద్వారం (రెక్టమ్) నిండినప్పుడు అది సంకోచించి, పాయువు వద్ద ఉండే కండరాలను సడలిస్తుంది. సాధారణ సమయాల్లో ‘ప్యూబోరెక్టాలిస్’ అనే కండరం మలద్వారాన్ని ఒక ఉచ్చులా పట్టి ఉంచి.. మలం బయటకు రాకుండా ఒక కోణంలో (ఆనోరెక్టల్ యాంగిల్) బంధిస్తుంది. మలవిసర్జన సమయంలో ఈ కండరం వదులుగా మారి ఆ మార్గాన్ని తెరుస్తుంది. ఈ రకంగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.
కాగా ఎన్నో ఏళ్లుగా భారతీయులు మలవిసర్జన కోసం ‘స్క్వాటింగ్’ (కింద కూర్చునే పద్ధతి – ఇండియన్ టాయిలెట్) పొజిషన్నే అనుసరించేవారు. అయితే సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ అలవాటును పక్కన పెట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్లు (కమోడ్లు) తప్పనిసరి అయ్యాయి. అయితే మన శరీరానికి కింద కూర్చునే పద్ధతే ఎంతో అనుకూలమైనదని చెబుతున్నారు. ఈ పద్దతిలో కూర్చున్నప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు పూర్తిగా మడిచి ఉండి.. శరీరం సుమారు 35 డిగ్రీల కోణంలో వంగుతుంది. దీనివల్ల ప్యూబోరెక్టాలిస్ కండరం పూర్తిగా సడలి, మలద్వార మార్గం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిటారుగా తెరుచుకుంటుంది. దాంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా మలం సులభంగా బయటకు వస్తుంది. అందుకే ‘స్క్వాటింగ్’ పొజిషన్ను అత్యంత శాస్త్రీయమైన పద్ధతిగా వైద్య నిపుణులు చెబుతున్నారు.