
వానాకాలంలో వాతావరణంలో ఉండే అధిక తేమ బురద కారణంగా పాలకూర ఆకులపై మన కంటికి కనిపించని కోట్లాది ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు విపరీతంగా వృద్ధి చెందుతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజన్ మరియు గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. మరి వర్షాకాలంలో పాలకూరను సురక్షితంగా ఎలా వండుకోవాలి? ఆకుల్లోని బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేసే పర్‌ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.
1. వానాకాలం పాలకూరతో ఉండే ముప్పు
వర్షపు నీరు నేరుగా ఆకుకూరలపై పడటం వల్ల అవి నేలకు దగ్గరగా పెరగడం వల్ల ‘సాల్మొనెల్లా’, ‘ఈ-కోలి’ (E.coli) వంటి భయంకరమైన బ్యాక్టీరియాలు ఆకులకు అంటుకుంటాయి.
సాధారణంగా చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన పాలకూరను కేవలం ఒక్కసారి మామూలు నీటితో కడిగి వండేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆకులపై ఉండే జిగట మురికి, పురుగుల గుడ్లు బ్యాక్టీరియా అస్సలు వదలవు. ఇది కడుపునొప్పి, విరేచనాలు మరియు టైఫాయిడ్‌కు దారితీస్తుంది.
2. పాలకూరను శుభ్రం చేయాల్సిన పర్‌ఫెక్ట్ పద్ధతి
స్టెప్ 1 – పాడైన ఆకులను వేరు చేయడం: ముందుగా పాలకూర కట్టను విప్పి అందులో కుళ్ళిపోయిన, నల్లగా లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను పూర్తిగా తీసి పక్కన పడేయాలి. కేవలం తాజాగా ఉన్న ఆకులను మాత్రమే వండడానికి ఎంచుకోవాలి.
స్టెప్ 2 – ఉప్పు లేదా వెనిగర్ నీటిలో నానబెట్టడం : ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని.. అందులో ఒక చెంచా రాళ్ల ఉప్పు లేదా రెండు చెంచాల తెల్ల వెనిగర్ కలపాలి. ఈ నీటిలో పాలకూర ఆకులను 5 నుండి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఉప్పు వెనిగర్‌లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఆకులపై ఉండే సూక్ష్మజీవులను, కెమికల్స్ (రసాయన మందులు) ను సమర్థవంతంగా తొలగిస్తాయి.
స్టెప్ 3 – ప్రవహించే నీటి కింద కడగడం : ఉప్పు నీటి నుండి తీసిన తర్వాత, ఆకులను కుళాయి కింద ప్రవహించే శుభ్రమైన నీటిలో మరో రెండు సార్లు బాగా కడగాలి. దీనివల్ల ఆకుల సందుల్లో ఉండే ఇసుక, మట్టి పూర్తిగా కొట్టుకుపోతాయి.
స్టెప్ 4 – ఆరబెట్టడం : కడిగిన పాలకూరను వెంటనే మూత పెట్టి వండకూడదు. ఒక జల్లెడ గిన్నెలో వేసి నీరంతా పోయాక, పొడి కాటన్ బట్టపై కాసేపు ఆరబెట్టాలి. తేమ తగ్గిన తర్వాతే వంటకు ఉపయోగించాలి.
3. నిపుణులు ఇస్తున్న అదనపు హెచ్చరికలు:
పచ్చిగా తినకూడదు : వర్షాకాలంలో పాలకూరతో చేసిన సలాడ్స్ లేదా పచ్చి పాలకూర జ్యూస్‌లను పూర్తిగా దూరం పెట్టాలి. ఆకులను బాగా ఉడికించి వండినప్పుడు మాత్రమే అందులోని మిగిలిన బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.
కటింగ్ తర్వాత కడగవద్దు: చాలా మంది ఆకుకూరలను చిన్నగా కోసిన తర్వాత కడుగుతుంటారు. అలా చేయడం వల్ల ఆకుల్లో ఉండే నీటిలో కరిగే వృధా అయిపోతాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఆకులను కడిగిన తర్వాతే కట్ చేయాలి.
ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాకాలంలో పాలకూర యొక్క పూర్తి పోషకాలను పొందుతూనే.. ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక :
ఇది కేవలం సమాచారం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మరియు ఆకుకూరల నాణ్యతను బట్టి బ్యాక్టీరియా తీవ్రత మారవచ్చు. తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు వర్షాకాలంలో డైట్ మార్పుల విషయంలో క్వాలిఫైడ్ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.