లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

|

Mar 24, 2025 | 9:46 PM

కాలేయం అనారోగ్యకరమైన ఆహారాలు, మద్యం వంటి వాటి వల్ల దెబ్బతింటుంది. ఇది శరీరంలో విషాలను తొలగించే ముఖ్యమైన అవయవం. కాలేయం సరిగా పనిచేయడం ఆగిపోతే జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి కాలేయాన్ని శుభ్రంగా ఉంచడం ఆరోగ్యానికి చాలా అవసరం. కొన్ని ఆహారాలు సహజంగా కాలేయాన్ని డీటాక్స్ చేస్తాయి. వాటిని ఆహారంలో చేర్చడం ద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Healthy Liver
Follow us on

కాలేయం శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు, శుద్ధి చేసిన పిండి వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే ఇవి కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. ఫలితంగా కాలేయం సరిగా పనిచేయకపోవడంతో జ్వరం, వాంతులు, వికారం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల కాలేయాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలు ఆహారాలను రోజువారీగా తీసుకోవడం అవసరం.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది అల్లిసిన్ అనే సమ్మేళనం. ఇది కాలేయాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. అల్లిసిన్ వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో కాలేయం నుండి పేరుకుపోయిన మురికిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే వెల్లుల్లి లివర్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

గ్రీన్ టీ

గ్రీన్ టీ జీవక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి దీనిని ఎక్కువ మంది బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారు. కానీ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ టీని మితంగా తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే గ్రీన్ టీని అధికంగా తాగకూడదు.. రోజుకు రెండు కప్పులకే పరిమితం చేయాలి.

పసుపు

పసుపు అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాల గని. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయాన్ని నష్టం, గాయం, వాపు వంటి వాటి నుండి రక్షిస్తుంది. పసుపు వాడటం వల్ల కాలేయం మంచిగా పని చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ, లిపిడ్ జీవక్రియను పెంచి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బీట్‌ రూట్

బీట్‌రూట్ లివర్ నిర్విషీకరణకు చాలా ఉపయోగకరం. ఇది కాలేయం నుండి పేరుకుపోయిన విషాలను బయటికి తీయడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల వాపు, నష్టం తగ్గుతాయి.

బ్రోకలీ

మీరు కాలేయాన్ని డీటాక్స్ చేయాలనుకుంటే బ్రోకలీని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. బ్రోకలీ కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఫ్యాటీ లివర్, లివర్ ట్యూమర్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే బ్రోకలీని పచ్చిగా కాకుండా తేలికగా ఉడకబెట్టి తినడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)