
అనేక సందర్భాల్లో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే అకస్మత్తుగా చేతులు లేదా కాళ్ల పాదాల అరికాళ్లలో తీవ్రమైన దురద ప్రారంభమవుతుంది. ఈ దురద కొద్దిసేపటి తర్వాత వాటంతట అవే తగ్గిపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఇది ఎంతగా వేధిస్తుందంటే పదే పదే గోకాలనిపిస్తుంది. కొన్ని సమయాల్లో గోకిన చోట ఎర్రటి రంగులోకి మారడం, చిన్న చిన్న పొక్కులు రావడం లేదా చర్మం పొరలు ఊడిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చేతులు, పాదాల అరికాళ్ల చర్మం అత్యంత పొడిగా మారినప్పుడు తీవ్రమైన దురద సమస్య తలెత్తుతుంది. పదే పదే సబ్బులతో చేతులు కడుక్కోవడం, వేడి నీటిని ఎక్కువగా ఉపయోగించడం లేదా చర్మానికి సరిపడని ఉత్పత్తులను వాడటం వల్ల చర్మంలోని సహజమైన తడి, నూనెలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం బిగుతుగా మారి దురద పుడుతుంది.
కొత్తగా మార్చిన సబ్బు, హ్యాండ్‌వాష్, డిటర్జెంట్, హ్యాండ్ సానిటైజర్, పాదాలకు రాసే క్రీములు లేదా సరిపడని చెప్పులు ధరించడం వల్ల ఈ అలెర్జీ ఏర్పడవచ్చు. వైద్య పరిభాషలో దీనిని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు.. ఈ సమస్య ఉన్నప్పుడు అరికాళ్లలో దురదతో పాటు ఎరుపుదనం, వాపు లేదా చిన్న ఫోడల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పాదాల వేళ్ల మధ్య భాగంలో గాలి తగలకుండా ఎక్కువ సేపు చెమటతో తడిగానే ఉంటే అక్కడ ఫంగస్ పెరిగే అవకాశం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల పాదాల అరికాళ్లలో భరించలేని దురద, చర్మం తెగిపోవడం లేదా మంట పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం పూర్తిగా మూసి ఉండే బూట్లు లేదా షూస్ వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమందికి చేతులు లేదా పాదాల అరికాళ్లపై ఎగ్జిమా సమస్య ఇబ్బంది పెడుతుంది. ఇందులో చిన్న నీటితో నిండిన పొక్కులు రావడం, తీవ్రమైన దురద కలగడం, చర్మం గరుకుగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా డిషిడ్రోటిక్ ఎగ్జిమా అనే రకం సోకినప్పుడు అరికాళ్లలో నీటి పొక్కులు ఏర్పడి విపరీతమైన దురద కలుగుతుంది.
ఎక్కువగా చెమట పట్టడం, వేడి వాతావరణం లేదా కాళ్లు నిరంతరం బూట్లలోనే బందీ అయి ఉండటం వల్ల చర్మంలో జలదరింపు, మంట, దురద పెరుగుతాయి. చెమట వల్ల చర్మం నిరంతరం తడిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
అరికాళ్లలో దురదగా ఉన్నప్పుడు వాటిని పదే పదే గట్టిగా గోకడం మానుకోవాలి. చర్మం పొడిగా ఉంటే సువాసన లేని మంచి మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా రాయాలి. కొత్త ఉత్పత్తులు వాడిన తర్వాతే దురద మొదలైతే వెంటనే వాటి వాడకాన్ని నిలిపివేయాలి. పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా కడుక్కుని, ముఖ్యంగా వేళ్ల మధ్య భాగాలను ఎండిపోయేలా పొడిగా ఉంచుకోవాలి. దురద తీవ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్య సలహా లేకుండా వాటంతట అవే స్టెరాయిడ్ లేదా యాంటిఫంగల్ క్రీములు వాడకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.