ఈస్ట్రోజెన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే డేంజరే

శరీరంలో పేరుకుపోయే అదనపు ఈస్ట్రోజెన్‌ను ప్రాసెస్ చేసి, వ్యర్థాల రూపంలో బయటకు పంపే ప్రధాన బాధ్యత లివర్‌దే. మొదట లివర్ ఈస్ట్రోజెన్‌ను విచ్ఛిన్నం చేసి, ఆపై శరీరం నుండి బయటకు వెళ్లేలా ప్యాక్ చేస్తుంది. ఒకవేళ లివర్ పనితీరు మందగిస్తే ఈస్ట్రోజెన్ పూర్తిగా బయటకు వెళ్లకుండా మళ్లీ శరీరంలోనే తిరుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘ఈస్ట్రోజెన్ డామినెన్స్’ (Estrogen Dominance) అని పిలుస్తారు. దీనివల్ల మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈస్ట్రోజెన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే డేంజరే
Hormonal Imbalance

Updated on: May 20, 2026 | 6:20 AM

ఆధునిక కాలంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారిన జీవన విధానం, సమయం కాని సమయంలో తినడం, పోషకాహార లోపం వంటి చెడు అలవాట్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అయితే, హార్మోన్ల సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలు వెంటనే మార్కెట్లో దొరికే సప్లిమెంట్స్ లేదా హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, శరీరం లోపల నుండి సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా, సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు వచ్చే లక్షణాలను తగ్గించాలంటే, అన్నింటికంటే ముందుగా కాలేయం (లివర్), గట్ (జీర్ణవ్యవస్థ) పనితీరును మెరుగుపరచడం అత్యంత అవసరం.

గట్ ఆరోగ్యమే ముఖ్యం..

ఈ హార్మోన్ల లోపాన్ని సరిచేయడానికి ముందుగా గట్ హెల్త్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఆహారంలో 25 నుండి 35 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను అద్భుతంగా మెరుగుపరచవచ్చు. ఇందుకోసం అరటి పండ్లు, మునగ ఆకులు, మెంతులు, అవిసె గింజలు వంటి సహజసిద్ధమైన ఆహారాలను రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. అయితే, శరీరం ఎంతవరకు ఫైబర్‌ను తట్టుకోగలదో దాన్ని బట్టి మాత్రమే మోతాదును నిర్ణయించుకోవాలి. వీటితో పాటు పెరుగు, కాంజీ, ఇంట్లో తయారుచేసిన పచ్చళ్ళ వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ (పులియబెట్టిన ఆహారాలు) కూడా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జీర్ణవ్యవస్థ సాఫీగా మారిన తర్వాత లివర్‌కు అవసరమైన పోషకాలను అందించడం ముఖ్యం. గుడ్లు, షిటాకే మష్రూమ్స్‌లో ఉండే కొలిన్ అనే పోషకం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కాలేయంలోని డిటాక్సిఫికేషన్ (కల్మషాలను తొలగించే) ప్రక్రియకు మద్దతిస్తాయి. ఆకుకూరలు, ఉడికించిన పప్పుల్లో ఉండే సహజ ఫోలేట్, సన్‌ఫ్లవర్ గింజల్లో లభించే విటమిన్ బి6 హార్మోన్ల సమతుల్యతకు ఎంతగానో తోడ్పడతాయి.

ఈస్ట్రోజెన్ పునఃశోషణను అడ్డుకోవడం ఎలా?

శరీరం ప్యాక్ చేసిన ఈస్ట్రోజెన్ వ్యర్థాలు గట్ నుండి మళ్లీ రక్తంలోకి శోషించబడకుండా అడ్డుకోవడం మరొక ముఖ్యమైన ఘట్టం. నారింజ, యాపిల్ వంటి పండ్లలో ఉండే గ్లూకారిక్ యాసిడ్ ఈ ప్రక్రియలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది గట్‌లో ఉండే కొన్ని హానికరమైన ఎంజైమ్స్‌ను అడ్డుకొని, ఈస్ట్రోజెన్ మళ్లీ శరీరంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారిలో వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లవు. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఎక్కువ కాలం కొనసాగి సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

ఈ ప్రాథమిక దశలన్నీ సక్రమంగా పనిచేసిన తర్వాతే డిఐఎమ్ (DIM) సప్లిమెంట్స్ గురించి ఆలోచించాలి. డిఐఎమ్ అనేది బ్రోకోలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల నుండి లభించే ఒక సహజ సమ్మేళనం. ఇది ఈస్ట్రోజెన్‌ను సురక్షిత మార్గంలో విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది. కానీ, గట్ మరియు లివర్ వ్యవస్థ క్లియర్ కాకముందే డిఐఎమ్ సప్లిమెంట్స్ తీసుకుంటే, శరీరంలో ఇప్పటికే ఉన్న బ్లాకేజ్ మరింత పెరిగి లక్షణాలు వికటించే ప్రమాదం ఉంది.

అవసరమైతే నిపుణుల సలహాతో రోజుకు 1000 మిల్లీగ్రాముల డిఐఎమ్ పొడిని కొవ్వు ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. అప్పటికీ హార్మోన్ల సమస్యలు తగ్గకపోతే, హార్మోన్ మెటబాలిజం ఏ దశలో ఇబ్బంది పడుతోందో తెలుసుకోవడానికి ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలి. అయితే చాలా మందికి ఆ అవసరం రాదు. ముందుగా జీర్ణవ్యవస్థను, కాలేయాన్ని శుభ్రపరుచుకుంటేనే హార్మోన్ల సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుందని మహిళలు గుర్తుంచుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us