గోవా మాజీ గవర్నర్ మృదుల సిన్హా కన్నుమూత.. సిన్హా మృతిపట్ల ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం

గోవా మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత మృదులా సిన్హా (77) కన్నుమూశారు.

  • Balaraju Goud
  • Publish Date - 10:26 pm, Wed, 18 November 20
గోవా మాజీ గవర్నర్ మృదుల సిన్హా కన్నుమూత.. సిన్హా మృతిపట్ల ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం

గోవా మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత మృదులా సిన్హా (77) కన్నుమూశారు. తన 78 వ పుట్టినరోజుకు 10 రోజుల ముందు బుధవారం తుది శ్వాస విడిచారు. గోవా ముఖ్యమంత్రులుగా దివంగత మనోహర్ పారికర్, లక్ష్మీకాంత్ పార్సేకర్, ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. 2014 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్‌ వరకు ఆమె గోవా గవర్నర్‌గా పనిచేశారు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

ఆమె మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రజా సేవ కోసం బిజెపి నాయకురాలు చేసిన ఆమె చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. మృదులా సిన్హా ప్రజా సేవకురాలిగా ఎప్పటికీ గుర్తుంటారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె గొప్ప నైపుణ్యం కలిగిన రచయిత్రి అని, ప్రపంచ సాహిత్య రంగానికి సేవలందించారని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు.


మృదుల మరణం తనను బాధించిందని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృదులా సిన్హా తన జీవితకాలమంతా దేశం కోసం, సమాజం, పార్టీ కోసమే పనిచేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఆమె రచనలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.


1942 నవంబర్‌ 27న బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా ఛప్రా గ్రామంలో జన్మించిన మృదులా సిన్హా.. హిందీలో అనేక రచనలు చేశారు. దాదాపు 45కి పైగా పుస్తకాలు రాశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా.. కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్‌పర్సన్‌గానూ సేవలందించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలోని సమగ్రక్రాంతి కార్యక్రమంలోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. బీహార్ మాజీ మంత్రి డాక్టర్ రామ్ కృపాల్ సిన్హాతో వివాహం తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను పూర్తి చేశారు.