ప్రేమ ఎందుకు.. ఎప్పుడు.. ఎలా .. ఎవరిమీద పుడుతుందో ఎవరూ చెప్పలేదు.. లెక్కలేసి చెప్పడానికి అదేం ఆల్‌జీబ్రాలో.. జామెంట్రీనో కాదు.. కొన్ని లవ్‌స్టోరీలో ఇప్పటికీ ఓ పట్టాన అర్థంకాని బ్రహ్మ పదార్ధాల్లా నిలిచిపోయేవి కావు… ఇలాంటి లవ్‌స్టోరీలు బాలీవుడ్‌లో బాగానే ఉన్నాయి.. ఇందులో కూరుకుపోయిన కొందరి హృదయాలు ఫఠేల్మని పేలాయి.. కొందరు త్యాగరాజులయ్యారు.. మరికొందరు దేవదాసులయ్యారు… ఇంకొందరు కెరీర్‌నే నాశనం చేసుకున్నారు… ఇప్పుడు మనం ఓ గందరగోళపు ప్రేమకథను తెలుసుకుందాం! చిత్ర విచిత్రాతి లవ్ స్టోరీ ఇది..! ఈ స్టోరీలో నాలుగు ప్రధాన పాత్రధారులు.. అది 1949వ సంవత్సరం..! ఆ ఏడాదే అందాజ్ అనే సినిమా విడుదలైంది.. అందులో జద్దన్‌బాయి కూతురు నర్గీస్ హీరోయిన్! జద్దన్‌బాయి ఎవరంటే జవహర్‌లాల్ నెహ్రూ చెల్లెలు… అదేలాగా అంటే మోతీలాల్ నెహ్రూ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ… మోతీలాల్-దలీప్‌బాయిల ప్రణయానికి తీపిగురుతే జద్దన్‌బాయి… ఆ తర్వాత దలీప్‌బాయి ముస్లీంను పెళ్లి చేసుకోవడం.. జద్దన్‌బాయి కలకత్తాకు వెళ్లిపోవడంలాంటివి చాలానే జరిగాయి.. వాటి సంగతి వదిలేసి అసలుసిసలైన రొమాంటిక్ లవ్‌స్టోరీలోకి వెళ్దాం… అందాజ్ సినిమాతో నర్గీస్ పెద్ద స్టారయ్యింది… కొన్ని నెలలకే ఆమె నటించిన బర్సాత్ వచ్చింది.. రాజ్‌కపూర్‌తో నర్గీస్ నటించిన మొట్టమొదటి సినిమా అది! అందులో వీరిద్దరు ప్రేమ సన్నివేశాలను ఇరగదీశారు… చూసినవాళ్లకు కొత్తగా అనిపించింది… అన్నట్టు బర్సాత్‌లో వాళ్లిద్దరి ప్రేమ సన్నివేశమే తర్వాతి కాలంలో ఆర్.కె.బ్యానర్ లోగోగా మారింది… అటు పిమ్మట ఆవారా వచ్చింది.. ఈ చిత్రం షూటింగప్పుడే జద్గన్‌బాయి చనిపోయింది… బతికున్నంతకాలం తన కూతురును మగవాళ్లకు దూరంగా ఉంచింది జద్దన్‌బాయి. మహా గడుసరి కాబట్టి ఎలాంటి ఉపద్రవాలు జరగకుండా జాగ్రత్తపడింది. తల్లి కాలం చేశాక అన్న అఖ్తర్ నర్గీస్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకున్నాడు.. కానీ కుదరలా..! అన్ని బంధాలు తెంచేసుకుని నర్గీస్ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చింది.. అప్పుడామెకు తనవాడనుకునే ఓ మగతోడు అవసరమయ్యింది… సరిగ్గా ఈ అవకాశం కోసమే కాచుకూర్చున్న రాజ్‌కపూర్ ఆమెకు దగ్గరయ్యాడు.
ఆవారా, శ్రీ 420 సినిమాలు రాజ్‌కపూర్, నర్గీస్ జంటను హిట్‌పెయిర్‌ను చేశాయి.. ఈ సినిమాలతో నర్గీస్‌కు రాజ్‌కపూర్ మరింత దగ్గరయ్యాడు.. నిజానికి రాజ్‌కపూర్ గొప్ప హీరోయేం కాదు.. మంచి దర్శకుడు, మంచి నిర్మాత మాత్రమే! కానీ నర్గీస్ పుణ్యమా అని చాలా సినిమాల్లో అతడికి హీరో అవకాశం దొరికింది.. సమయం గడుస్తున్న కొద్దీ రాజ్‌కపూర్‌పై నర్గీస్ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది.. నర్గీస్ అంటే రాజ్‌కపూర్‌కు కూడా ఇష్టమే… కాకపోతే అతడికి అప్పటికే పెళ్లయింది… ఇద్దరు పిల్లలు కూడా! మరో అడ్డంకి ఏమిటంటే రాజ్‌కపూరేమో హిందూ… నర్గీసేమో ముస్లిం… రాజ్‌ను దక్కించుకోడానికి నర్గీస్ చాలా ప్రయత్నాలు చేసింది… నర్గీసంటే ప్రేమ ఉన్నప్పటికీ భార్య పిల్లలను వదులుకోలేకపోయాడు రాజ్… హిందూ వివాహ చట్టం కింద తామిద్దరం ఎలాంటి వివాదంలో చిక్కుకోకుండా రాజ్‌తో తన పెళ్లి చేయాల్సిందిగా అప్పటి బొంబాయి రాష్ట్ర హోంశాఖ మంత్రి మొరార్జీదేశాయ్‌ని వేడుకుంది కూడా! ఆయన కాదనేసరికి నిరాశకు గురైంది నర్గీస్… రాజ్‌కపూర్‌కు నర్గీస్ అంటే ఇష్టమే అయినా….నర్గీస్ ప్రేమించినట్టుగా తను ఆమెను ప్రేమించలేకపోయాడు…ప్రేమ కోసం సాహసం చేయలేకపోయాడు…. కుటుంబమనే పెద్దగీత ముందు నర్గీస్ చిన్నగీతైంది…అలాగని ఆమెను చిన్నచూపు చూసేవాడు కాదు….ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలన్నీ ఇచ్చేవాడు…భార్య పిల్లలతో ఏదైనా ఫంక్షన్‌కు వెళితే…రాజ్ వచ్చిన కాసేపటకి నర్గీస్ వచ్చేది… రాజ్ ఫ్యామిలీకి దూరంగా కూర్చునేది…అయిదు పది నిమిషాల తర్వాత అక్కడో డ్రామా జరిగేది… ఆ హాల్లో నర్గీస్‌ను అప్పుడే చూసినట్టు రాజ్ గొప్పగా నటించేసి….ఆమె దగ్గరకు వెళ్లేవాడు… వచ్చి తన పక్కన కూర్చోమని ఆహ్వానించేవాడు.. నర్గీస్ కూడా ఆయన అభ్యర్థనను కాదని చెప్పకుండా నెమ్మదిగా అతడి పక్కన వచ్చి కూర్చొనేది… ఈ ఇద్దరి మధ్య సాగిన లవ్వాట- ఆనాడు తెరబయట కూడా కావాలసినంత పసందును పంచింది.
నర్గీస్-రాజ్‌కపూర్‌ల ప్రేమకథ ఇలా సాగుతుండగానే ప్యారలల్‌గా మరో ప్యార్ కహానీ నడిచింది… ఈ కథలో కూడా హీరోయిన్ నర్గీసే! హీరో మాత్రం దిలీప్‌కుమార్… దిలీప్‌కు నర్గీస్ అంటే చచ్చేంత ప్రేమ… అప్పటికింకా అతడికి పెళ్లి కాలేదు.. అందాజ్ సినిమాలోనే దిలీప్‌కు ప్రేమ మొగ్గతొడిగింది… అందాజ్ చిత్రం తర్వాత చాలా మంది నిర్మాతలు వీరిద్దరితో సినిమాలు తీయాలనుకున్నారు.. కానీ రాజ్‌కపూర్ పడనిస్తేగా… ఎక్కడ నర్గీస్ తనకు కాకుండా పోతుందోనన్న భయం… తనకు మాత్రమే దక్కాలన్న ఈర్ష్య. నర్గీస్‌తోనే ఆ సినిమాలన్నింటికీ నో చెప్పించేవాడు.. పాపం నర్గీస్ కూడా రాజ్ చెప్పినట్టే చేసేది.. జోగన్, హల్‌చల్, దీదార్ వంటి కొన్ని సినిమాల్లో తప్ప దిలీప్‌కుమార్‌తో నర్గీస్ నటించింది లేదు.. ఆ పాటికే దిలీప్‌కుమార్ నర్గీస్ ప్రేమలో నిలువెల్లా కూరుకుపోయాడు.. నర్గీస్ తన నుంచి దూరం కాకుండా వుండేందుకు రాజ్‌కపూర్ రహస్యంగా తాళికట్టాడని.. అది పరుల కంట కనబడకుండా నర్గీస్ జాకెట్లో భద్రంగా దాచుకునేదన్న గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి ..మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు… రాజ్‌కపూర్ ప్రేమలో పడి నర్గీస్ తన కెరీర్‌ను చెడగొట్టుకుంది.. రాజ్‌కపూర్ సినిమాల వల్ల నర్గీస్ పెద్దగా లాభపడిందేమీ లేదు… నటిగా గుర్తింపూ రాలేదు. రాజ్ సినిమాలు ఎలా వుంటాయో తెలిసిందే కదా! ఆయన సినిమాల్లో హీరోయిన్ కేవలం డమ్మీనే! సినిమా అంతా కథానాయకుడి చుట్టూ తిరగాల్సిందే…నర్గీస్ కట్టుకున్న కలల మేడలు కూలిపోగాసాయి.. భ్రమలన్నీ కరిగిపోసాగాయి..1955లో చోరీచోరీ సినిమా కోసం రాజ్‌కపూర్, నర్గీస్‌లిద్దరూ మద్రాస్‌కొచ్చారు… ఎవిఎం సంస్థ తీసిన ఆ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఎవిఎం స్టూడియోలోనే జరిగింది…రాజ్‌కపూర్ ఎలాంటివాడో నర్గీస్‌కు అప్పుడు తెలిసొచ్చింది.. చోరీచోరీ షూటింగ్ జరుగుతుండగానే పక్క ఫ్లోర్‌లో పద్మిని నటిస్తున్న ఏదో తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది…పద్మనీని చూసిన రాజ్ వెంటనే ఆమె మోజులో పడిపోయాడు..నర్గీస్‌ను పూర్తిగా మర్చిపోయాడు..
అప్పటికే నర్గీస్-రాజ్‌కపూర్ ప్రణయగాధ పత్రికల్లో వచ్చేసింది.. ఇవన్నీ దిలీప్ కుమార్‌లో నర్గీస్ పట్ల వున్న మిగిలివున్న కాస్త ప్రేమను కూడా చంపేశాయి…1956లో జాగ్‌తే రహో సినిమా వచ్చింది… రాజ్‌కపూర్ బ్యానర్‌లో నర్గీస్ నటించిన చిట్ట చివరి సినిమా ఇదే… అందులో హీరోహీరోయిన్లు కాకపోయినా రాజ్‌తో నర్గీస్ నటించిన చివరి సినిమా కూడా ఇదే…!
నర్గీస్ ప్రభ నెమ్మదిగా తగ్గడం మొదలైంది… సరిగ్గా అప్పుడే మహబూబ్‌ఖాన్ నర్గీస్‌కు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు.. అంతకు ముందు దిలీప్ హీరోగా కొన్ని సినిమా ప్రతిపాదనలు తెచ్చినా రాజ్ ప్రభావంతో నర్గీస్ వాటిని కాదంది… కానీ నర్గీస్ అదృష్టమేమిటంటే…మహబూబ్‌ఖాన్ వాటన్నింటినీ మనసులో పెట్టుకోకపోవడం….1940లో తను తీసిన ఔరత్ సినిమాను మళ్లీ నర్గీస్‌తో తీసేందుకు ముందుకొచ్చాడు…అదే మదరిండియా…ఇందులో బిర్జూ పాత్రకు ముందుగా అనుకున్నది దిలీప్ కుమార్‌ను…కానీ హృదయం లేని ప్రియురాలి మీద కోపంతో మండిపోతున్న దిలీప్ నో చెప్పాడు…అవును మరి…ప్రేమ పుట్టినా…దోమ కుట్టినా తట్టుకోవడం కష్టమే కదా! దిలీప్ కాదనడంతో ఆ వేషం సునీల్ దత్‌కు దక్కింది…మదరిండియా షూటింగ్‌లో నిప్పుల్లో చిక్కుకున్న నర్గీస్‌ను సునీల్ కాపాడటంతో అందుకు బదులుగా ఆమె తన జీవితాన్ని ఇచ్చింది…ఆ సినిమా షూటింగప్పుడే వాళ్లిద్దరి ప్రేమ గుప్పుగుప్పుమంది… సినిమా విడుదలకు ముందే ఇద్దరు ఒక్కటయ్యారు…తదనంతర కాలంలో ముగ్గురు పిల్లలను కన్నారు…మరోవైపు రాజ్‌కపూర్ తన తర్వాతి చిత్రం జిస్ దేశ్‌మే గంగా బెహతీ హైలో పద్మినీని తీసుకున్నాడు… ఎప్పటిలాగే తన కథానాయికలతో ప్రేమ కలాపాలు సాగిస్తూ అటు కుటుంబం దూరం కాకుండా చూసుకున్నాడు…దిలీప్ మాత్రం నర్గీస్ జ్ఞాపకాలతో చాలా కాలం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు… వయసుదాటిపోయాక 1966లో సైరాబానును చేసుకున్నాడు…విచిత్రమైన ఈ లవ్‌స్టోరీలో ఎవరి ప్రేమా సక్సెస్ కాలేదు…అయినా అందరూ హాప్పీగానే వున్నారు…
(వాలెంటైన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం)