NTR: ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడ్డారు.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్

1962లో విడుదలైన రక్తసంబంధం చిత్రం ఎన్టీఆర్, సావిత్రిల నటనతో గొప్ప విజయం సాధించింది. తమిళ పాశమలర్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రికి అన్నగా నటించేందుకు మొదట అక్కినేని నాగార్జున రావు సంశయించారు. ఆయన సూచనతో ఎన్టీఆర్ ఈ పాత్రను అంగీకరించారు.

NTR: ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడ్డారు.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్
Senior Ntr

Updated on: Mar 21, 2026 | 1:25 PM

నడిగర తిలకం శివాజీ గణేశన్, మహానటి సావిత్రి అన్నచెల్లెళ్లుగా నటించిన తమిళ చిత్రం పాశమలర్ 1961లో విడుదలై పెద్ద విజయం సాధించింది. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అజరామరమైన దృశ్యకావ్యంగా మలిచిన ఈ చిత్రాన్ని ఏ. భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం, కథ తెలుగు నిర్మాత డూండీని బాగా ఆకర్షించాయి. ఆ సమయంలో డూండీ, సుందర్‌లాల్ నహతాతో కలిసి సినిమాలు తీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను సుందర్‌లాల్ చూసుకునేవారు కాగా, సృజనాత్మక పనులు డూండీకి వదిలేసేవారు. డూండీ జడ్జిమెంట్‌పై సుందర్‌లాల్‌కు ఎంతో నమ్మకం ఉండేది.

ఈ సినిమాను మొదట అక్కినేని నాగేశ్వరరావుతో చేయాలని డూండీ భావించారు. శాంతినివాసం, శభాష్ రాజా వంటి వారి చిత్రాల్లో అక్కినేనే హీరో. ఆయన దగ్గరికి వెళ్లి పాశమలర్ చిత్రం గురించి చెప్పినప్పుడు, సావిత్రికి అన్నగా నటించాలనేసరికి అక్కినేని సంశయించారు. “నాతో ఈ సినిమా తీస్తే జనం చూడరు. ఎన్టీఆర్‌ను అడుగు, ఆయనైతే బావుంటుంది” అని సలహా ఇచ్చారు. అప్పటికి సుందర్‌లాల్ నహతా, డూండీలు ఎన్టీఆర్‌తో బందిపోటు చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చారు. వెంటనే డూండీ ఎన్టీఆర్‌ను కలిశారు. ఎన్టీఆర్ కూడా పాశమలర్ చిత్రం గురించి విని ఉండటంతో, డూండీ అడగగానే వెంటనే ఓకే అన్నారు. సావిత్రితో జంటగా ఆయన నటించిన గుండమ్మ కథ ఆ సమయంలో వీరవిహారం చేస్తోంది. అయినా సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన సంశయించలేదు. ఎన్టీఆర్ ఒక సినిమా ఒప్పుకునే ముందు రెండు విషయాలు చూసుకునేవారు. అవి నిర్మాత గట్టివాడా కాదా? ఆ వేషం తన కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని. మిగతా విషయాలు ఏవీ పట్టించుకునేవారు కాదు. దర్శకుడు ఏది చెబితే అది చేసేవారు.

బందిపోటు చిత్రానికి ఇచ్చిన కాల్ షీట్లను రక్తసంబంధం చిత్రానికి సర్దుబాటు చేశారు ఎన్టీఆర్. విక్టరీ మధుసూదనరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. మాటల రచయితగా ముళ్ళపూడి వెంకటరమణ ఎన్నికయ్యారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. మిగతా విషయాలను పట్టించుకోని ఎన్టీఆర్ కొత్త రచయిత అనగానే కొంచెం భయపడ్డారు. “ఎందుకొచ్చిన రిస్క్? ఆత్రేయను పెట్టుకోవచ్చు కదా” అన్నారు డూండీతో. డూండీ ఆయనకు నచ్చజెబితే ఇక కాదనలేదు. పాశమలర్ చిత్రానికి తెలుగులో పెద్ద మార్పులు చేయలేదు. తెలుగు నేటివిటీని మాత్రమే జత చేశారు. అలాగే, తమిళంలో సెపరేట్‌గా ఉన్న కామెడీ ట్రాక్‌ను తెలుగులో ప్రధాన కథతో కలిపారు. సూర్యకాంతం, రేలంగి, గిరిజ, రమణారెడ్డి హాస్యం బాగా పండింది.

తమిళంలో జెమినీ గణేశన్ వేసిన వేషాన్ని తెలుగులో కాంతారావు చేశారు. పైగా ఆయనంటే ఎన్టీఆర్‌కు అభిమానం. అందుకే ఎన్టీఆర్ కూడా కాదనలేదు. కాంతారావు, సావిత్రులపై చిత్రీకరించిన “ఎవరో నన్ను కవ్వించి పోయేదెవరో” పాట కోసం ప్రత్యేకంగా కొడైకెనాల్ వెళ్ళడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. అది చాలా చిన్న వేషం. కథంతా సావిత్రి చుట్టూ నడుస్తుంది. దేవిక అన్నగా ప్రభాకర్ రెడ్డి నటించారు. రక్తసంబంధం చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్‌కు 39, సావిత్రికి 26 ఏళ్లు. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం పండించేందుకు వారిద్దరూ పడిన తపన నిజంగా అపురూపం, అపూర్వం. ముఖ్యంగా అనారోగ్యం పట్టి పీడిస్తున్న దగ్గర నుంచి తన కదలికల్లో నందమూరి చేసిన మార్పులు ఎవరూ మరిచిపోలేరు. ఈ సినిమాలో హైలైట్ సాంగ్ “చందురుని మించి అందములకించు”. తమిళంలో కంటే తెలుగులోనే ఈ పాట బాగా వచ్చింది. రచయిత అనిసెట్టి దీనికోసం ఎన్ని వెర్షన్లు రాశారో లెక్కలేదు.

1962 నవంబర్ 1న రక్తసంబంధం విడుదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన గుండమ్మ కథ చిత్రం ఈ సినిమా కంటే నాలుగన్నర నెలల ముందు విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు వారాలకు వారిద్దరూ జంటగా నటించిన మరో చిత్రం ఆత్మబంధువు విడుదలైంది. ఈ మూడు చిత్రాలు ఘన విజయం సాధించడం విశేషం. నాలుగు లక్షల రూపాయల బడ్జెట్‌తో రక్తసంబంధం చిత్రం రూపుదిద్దుకుంది. ఎంతో స్టార్ డమ్ ఉన్న ఎన్టీఆర్‌కు 25,000, సావిత్రికి 20,000 పారితోషికం ఇచ్చారు. దేవికకు ఇచ్చింది 5,000, కాంతారావుకు 10,000 ఇచ్చారు. 11 కేంద్రాల్లో రక్తసంబంధం చిత్రం 100 రోజులు ఆడింది.

Follow Us