
ఆర్నబ్ తుపాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది పిల్లా పాపలతో సహా రోడ్డున పడ్డారు. కనీసం తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఆర్నబ్ తుపాను బాధితులకు అండగా నిలిచారు. నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, తాగునీరు, ఇతర అత్యవసర వస్తువులను అందిస్తున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తన టీమ్ తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు శైలేష్ కొలను. అంతేకాదు ఈ డైరెక్టర్ ఇచ్చిన పిలుపుతో వందలాది మంది యువతీ యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శైలేష్ కొలను సేవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు టాలీవుడ్ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శైలేష్ లాగే సినీ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు కూడా ముందుకు వచ్చి తుపాను బాధితులకు సహాయం చేయాలని కోరుతున్నారు.
ఇక శైలేష్ కొలను విషయానికి వస్తే.. హిట్’ ఫ్రాంఛైజీ సినిమాలతో టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారీయన. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన సైంటిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో అన్నిటినీ వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2020లో విశ్వక్ సేన్‌తో కలిసి శైలేష్ తెరకెక్కించిన ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ సంచలన విజయం సాధించింది. తెలుగులో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను హిందీలో రాజ్‌కుమార్ రావుతో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు శైలేష్. ఆ తర్వాత అడివి శేష్‌తో ‘హిట్ 2’, విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమాలను తెరకెక్కించారు. ఇక గతేడాద నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందించిన హిట్3 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఇదే హిట్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు శైలేష్. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి