
తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రతిభను ఆహ్వానించడంలో ముందుంటుంది. ప్రతి ఏటా ఎంతోమంది అందాల భామలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా, ప్రేక్షకులను మెప్పించి ఇక్కడ పాగా వేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ ఏడాది వెండితెరపై మెరవబోతున్న కొందరు అమ్మాయిల జాతకం చూస్తుంటే, వారు గ్లామర్ తోనే కాకుండా నటనా నైపుణ్యంతోనూ స్టార్ హీరోయిన్లుగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఒకరు ఏకంగా రెబల్ స్టార్ సరసన పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తుండగా, మరొకరు బాలీవుడ్ అగ్ర నటి వారసురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకొకరు ఏకంగా పాన్ ఇండియా దర్శకుడి విజువల్ వండర్ లో ‘స్పిరిట్’ చూపించబోతున్నారు. ఇంతకీ టాలీవుడ్ భవిష్యత్తును మార్చబోతున్న ఆ కొత్త కథానాయికలు ఎవరు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన తొలి సినిమా చేసే అవకాశం రావడం అంటే ఏ హీరోయిన్ కైనా అది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ అదృష్టం ఇమాన్వీ ఇస్మాయిల్ కు దక్కింది. హను రాఘవపూడి దర్శకత్వంలో 1940 నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఫౌజి’ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి, ప్రేమ అంశాలతో సాగే ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి దిగ్గజాలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ దసరాకు రాబోతున్న ఈ సినిమా ఇమాన్వీ కెరీర్ కు పెద్ద మలుపు కానుంది.
‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రతో నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న త్రిప్తీ దిమ్రి, ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో టాలీవుడ్ లోకి నేరుగా అడుగుపెడుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘శ్రీనివాస మంగాపురం’లో ఆమె మంగ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ ‘సీతా పయనం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సాత్విక వీరవల్లి పరిచయం అవుతుండగా, విశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమాతో కన్నడ భామ ఏక్తా రాథోడ్ టాలీవుడ్ కు వస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్ గా నటిస్తోంది. మంచి కూచిపూడి డ్యాన్సర్ అయిన వీణ, వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మెరవబోతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన సారా అర్జున్ ఇప్పటికే ‘యుఫోరియా’ సినిమాతో మెప్పించింది. త్వరలో గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’తో ఆమె మరోసారి అలరించనుంది. ఇక మాళవికా మోహనన్ ‘ది రాజాసాబ్’ సినిమాతో ఈ సంక్రాంతికే తన టాలీవుడ్ ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టింది. ఇలా ఒక్కొక్కరు తమదైన శైలిలో తెలుగు ఇండస్ట్రీలో ముద్ర వేయాలని చూస్తున్నారు. కొత్త కథానాయికల రాకతో టాలీవుడ్ గ్లామర్ డోస్ మరింత పెరగనుంది. వీరిలో ఎంతమంది టాప్ హీరోయిన్లుగా ఎదుగుతారో కాలమే నిర్ణయించాలి.