Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్ ఎస్. జానకి. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించున్నారు.

Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
S Janaki Films

Updated on: Jul 11, 2026 | 9:47 PM

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గాన కోకిల, నైటింగేల్‌ ఆఫ్‌ సౌతిండియా, ప్రముఖ గాయని… S. జానకి అసలు పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చాలాకాలం పాటు ఆమె సిరిసిల్లలోనే పెరిగారు. ఆవిడ 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం పొందారు. వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు అందుకున్నారు. 12సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి జానకమ్మ గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని ఈ మహాగాయని తిరస్కరించారు.

1957లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. 1938 ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఆయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వర విద్వాన్ పైడిస్వామి దగ్గర సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట, తన మామయ్య సలహా మేరకు, చెన్నైలోని AVM స్టూడియోలో పాడటం ప్రారంభించారు.

తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో, జానకమ్మ సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువాళ్లకు దగ్గరయ్యారు. ఈ చిత్రంలో పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా సెలయేరులా మొదలైన ఆమె గానం… ఎన్నో మలుపులు తిరుగుతూ ఓ మహా సాగరంలా మారి తెలుగువాళ్లను మంత్రముగ్దులను చేశాయి. ఈ గానకోకిల గాయని మాత్రమే కాదు… పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుడు, షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఆమె నిత్యం పూజల్లో మునిగితేలేవాళ్లు. అంతేకాక మీరాబాయిపై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని మెప్పించారు. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరంతో పాటు చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాటలు పాడారు. శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్, బామ్మ గొంతులతో పాట పాడడం ఆమె గాన వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసిందీ అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. ఈమె 55 ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు సుమారు ఐదారు తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలనూ స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్యగానం చేసింది. వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం ఆమె గానశైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది.

హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి…. ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడిన జానకి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్‌ 1990లలో మరణించారు. ఆవిడకు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నారు. ఈయన భరతనాట్యంలో ప్రవీణుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు అనే చిత్రాల్లో నటించారు. మురళీకృష్ణ, ఈ ఏడాది జనవరి 22న మరణించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో తన మనవడు చనిపోవడంతో జానకమ్మ తీవ్ర మానసిక ఆవేదనకు లోనయ్యారు.

Follow Us