
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థితి ఏర్పడింది. జైలర్ 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ కాకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో రెండు సినిమాలకు రజనీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి ప్రాజెక్ట్‌కు సుందర్ సి దర్శకత్వం చేయనున్నట్టు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే సుందర్ సి వెనక్కి తగ్గడంతో ప్రాజెక్ట్ మళ్లీ సందిగ్ధంలో పడింది.
అనంతరం ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు బలంగా వినిపించింది. ఆయన రజనీకి స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చి సూపర్‌స్టార్‌ను ఆకట్టుకున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పటివరకు అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు. తాజాగా ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకున్న అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అశ్వత్ రజనీకి బౌండ్ స్క్రిప్ట్ చెప్పి ఆకట్టుకున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జనవరి 2026లో అధికారిక ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు.
నిజానికి రజనీకాంత్‌కు ఇలాంటి సందిగ్ధం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆరోగ్య కారణాలతో సినిమాల స్పీడ్ తగ్గించాలని నిర్ణయించుకున్న ఈ సూపర్‌స్టార్, ఇంకా మూడేళ్లలో రిటైర్‌మెంట్ ప్రకటన చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కెరీర్ చివరి దశలో చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారట. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, అధిక క్వాలిటీ ఇచ్చే దర్శకులనే ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే ఆ అంచనాలను అందుకున్నాడని టాక్.
ప్రస్తుతం రజనీ జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ 2026 జూన్ లేదా ఆగస్టులో రిలీజ్ కానుంది. షూటింగ్ రెగ్యులర్‌గా సాగుతున్నప్పటికీ, రజనీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యలో బ్రేక్స్ ఇస్తున్నారు. జైలర్ 2 పూర్తయిన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.
కమల్ హాసన్ – రజనీ కాంబినేషన్ మల్టీస్టారర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరు లెజెండ్స్‌ను బ్యాలెన్స్ చేయగల సమర్థుడు ఎవరనే ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజమౌళి లాంటి దర్శకులు చేయగలిగినా, వారి బిజీ షెడ్యూల్, సినిమా తీయడానికి పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అది కష్టమే. రజనీ టార్గెట్ ఒక్కటే – తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చే దర్శకుడు.
ఇలాంటి సమయంలో యంగ్ డైరెక్టర్ల వైపు చూడటం రజనీకి కొత్త అనుభవం. అశ్వత్ మారిముత్తు లేదా రామ్ కుమార్ బాలకృష్ణన్‌లో ఎవరు ఈ బాధ్యతను తీసుకుంటారో చూడాలి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.