
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్, పురాణాల నేపథ్యం, ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. వారణాసి చిత్రాన్ని కేవలం సైన్స్ ఫిక్షన్ కథగా మాత్రమే చూడకూడదని రాజమౌళి అన్నారని తెలుస్తుంది. ఇందులో పురాణ అంశాలతో కూడిన ఫాంటసీ ప్రపంచంతో పాటు కుటుంబ బంధాలు, ప్రేమ వంటి ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య అనుబంధం,అలాగే హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని తెలుస్తోంది.
విభిన్నమైన కథాంశాలను ఒకే సినిమాలో చూపించడం చేయడం ఈ చిత్రానికి ప్రధాన సవాలుగా మారిందని రాజమౌళి పేర్కొన్నారు. దాదాపు ఆరు లేదా ఏడు విభిన్న సినిమాల్లో ఉండే అంశాలను ఒకే కథలో చేసిన అనుభూతి వారణాసిలో ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా స్టోరీ ఏ స్థాయిలో ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.అలాగే ఈ సినిమాలో మహేశ్ బాబు నటన మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మహేశ్‌లోని నటనా సామర్థ్యం గురించి ముందే అవగాహన ఉన్నప్పటికీ, ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత తన అంచనాలను మించి నటించారని రాజమౌళి అన్నారు. తన పాత్రకు మహేశ్ బాబు పూర్తి న్యాయం చేయడంతో పాటు, పాత్రలో పూర్తిగా లీనమై నటించారని రాజమౌళి పేర్కొన్నట్లు తెలుస్తోంది. నటుడిగా మహేశ్ చూపించిన డెడికేషన్ తనను ఆశ్చర్యపరిచిందని, ఆయనతో పనిచేయడం మరచిపోలేని అనుభవమని రాజమౌళి అన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించనుండటం కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్.. సినిమా గురించి వస్తున్న విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తి నెలకొంది. పురాణ నేపథ్యం, టైమ్ ట్రావెల్, ఫాంటసీ, కుటుంబ భావోద్వేగాలు వంటి విభిన్న అంశాలను రాజమౌళి ఎలా తెరపై ఆవిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.