
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సినీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, శివాజీ గణేశన్‌లతో తనకు గల అనుబంధాన్ని పరుచూరి పలుకులు కార్యక్రమంలో గతంలో వివరించారు. 1981 అక్టోబర్‌లో అధ్యాపక ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమా అవకాశాల కోసం మద్రాసు బయలుదేరిన రోజుల నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పట్లో నెలకు కేవలం పదుకొండు వందల రూపాయల జీతం పొందే గోపాలకృష్ణకు, మద్రాసు వెళ్లే నిర్ణయం ఒక సవాలుగా మారింది. తన భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మద్రాసులో అవకాశం రాకపోతే కుటుంబం ఎలా బ్రతకాలనే ప్రశ్న ఆయన మదిని తొలిచివేస్తున్న సమయం అది. దీనికి సమాధానంగా, అక్టోబరు 21న సెలవు తీసుకున్న పరుచూరి, నవంబర్ 1న బయలుదేరి, నవంబర్ 30లోగా నెల ఖర్చులకు పోగా, పదుకొండు వందల రూపాయలు సంపాదించి తెస్తానని, లేకపోతే తిరిగి వచ్చి ఉద్యోగంలో కొనసాగుతానని సవాలు చేశారు. మద్రాసు వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్‌లో వెయిట్ మిషన్ నుంచి వచ్చిన ఒక కార్డు, “నీది ఒక విచిత్రమైన జీవితం. ఒక ద్వారం మూసుకుంటే ఇంకో ద్వారం నీకు తెరుచుకుంటుంది” అని చెప్పింది. ఇది ఆయనకు విశ్వాసాన్ని కలిగించింది. మద్రాసులో మొదట రాఘవేంద్రరావు గారికి కథ చెప్పినా.. ఆయనకు నచ్చలేదు. అలా రోజులు గడిచిపోతుండగా, పద్నాలుగో రోజున అడవి సింహాలు చిత్ర దర్శకుడు అడిశిమిల్లి శేషారావు పరుచూరిని పిలిచి ఒక పరీక్ష పెట్టారు. నివురుగప్పిన నిప్పు చిత్ర క్లైమాక్స్ రాయమని కోరారు. అప్పటివరకు రాసిన వెర్షన్స్.. కృష్ణకు నచ్చినా శివాజీ గణేశన్‌కు నచ్చట్లా.. శివాజీకి నచ్చితో.. కృష్ణ గారికి నచ్చడం లేదని వివరించారు.
శేషారావు సూచన మేరకు పరుచూరి గోపాలకృష్ణ 14-16 పేజీల క్లైమాక్స్‌ను రాశారు. దర్శకత్వ శాఖలో పనిచేసే కే. మురళీ మోహన్‌రావు ఆ క్లైమాక్స్‌ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత కో డైరెక్టర్ బాపయ్య కూడా ఆ క్లైమాక్స్ వెర్షన్‌కు ముగ్ధుడయ్యారు. అనంతరం శివాజీ గణేశన్ వద్దకు తీసుకెళ్లగా, ఆయన కళ్లు మూసుకుని విన్నారు. చదవడం పూర్తవగానే, “నువ్వు ఎన్టీ రామారావు ఫ్యాన్‌వా?” అని ప్రశ్నించి, రామారావు గారు పలికినట్లే డైలాగ్స్ పలుకుతున్నాడు అని మెచ్చుకున్నారు. శివాజీ గణేశన్ కూడా ఓకే చెప్పడంతో, సూపర్ స్టార్ కృష్ణకు వినిపించారు. కృష్ణ కూడా క్లైమాక్స్‌ను అంగీకరించారు. ఈ నిర్ణయం పరుచూరి గోపాలకృష్ణ సినీ జీవితానికి ఒక పునాదిగా నిలిచింది. ఈ విజయం తర్వాత, అడిశిమిల్లి శేషారావు ఆయనకు ఎంత కావాలని అడగగా, పరుచూరి కృతజ్ఞతతో డబ్బు వద్దన్నారు.
ఆ తర్వాత అగ్నిజ్వాల సినిమా స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు గోపాలకృష్ణ పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేయగా.. ఐదు వేల రూపాయల అడ్వాన్స్ అందుకున్నారు. అదే రాత్రి, పి.సి.రెడ్డి బంగారు భూమి చిత్రంలోని పదుకొండు సీన్లు రాసే అవకాశం వచ్చి, మరో వెయ్యి నూటపదహారు రూపాయలు సంపాదించారు. మహారథి గారి అబ్బాయి చిట్టి ద్వారా మరో సినిమాకు ఐదు వేల రూపాయల అడ్వాన్స్ కూడా వచ్చింది. కేవలం ఏడు రోజుల్లోనే, గోపాలకృష్ణ పదుకొండు వేల రూపాయలకు పైగా సంపాదించి, నవంబర్ 30వ తేదీ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. పదుకొండు వందల రూపాయలు సంపాదించి రమ్మన్న తన భార్యకు, పది నెలల జీతానికి సమానమైన డబ్బుతో తిరిగి వచ్చి తన సవాలులో గెలిచానని నిరూపించారు.
మరుసటి రోజు బంగారు భూమి షూటింగ్‌లో కృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ రాసిన “పద్మ మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటికి ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టు” అనే డైలాగ్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ ఒక్క డైలాగే తనను ఎందరికో సిఫార్సు చేయడానికి కృష్ణ గారికి కారణమైందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. తన విజయానికి సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులు, సహకారమే కారణమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.