
ప్రముఖ సింగర్ కేకే( KK )(కృష్ణకుమార్ కున్నాత్) మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురించేసింది. సినిమా ఇండస్ట్రీ మరో అద్భుత సింగర్ ను కోల్పోయింది. బాలీవుడ్ గాయకుడు కేకే గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం కోల్కతాలో కేకే కన్నుమూశారు. ఓ లైవ్ షో తర్వాత అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కి తీసుకెళ్లారు. కేకేను పరిశీలించిన డాక్టర్లు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. కేకే వయస్సు 53 సంవత్సరాలు. హిందీతో పాటు తెలుగులోనూ ఎన్నో అద్భుత పాటలను ఆలపించారు. ఇటీవలే పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య జరిగిన విషయం తెలిసిందే.. ఆ విషాదం నుంచి బయటపడేలోగా ఇప్పుడు మరో విషాదం సంగీత ప్రియులకు షాక్ ఇచ్చింది.
కేకే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తూ.. ఆయన పాటలను గుర్తు చేసుకుంటున్నారు. రిప్ కేకే అంటూ ఆయన పాడిన పాటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ ట్వీట్ చేస్తూ..నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.. ఎడబాటు రేపిన విరహ వేదనా… నరక యాతనా.. అంటూ నువ్వు నేను సినిమాలో కేకే ఆలపించిన పాటలోని పదాలను రాసుకొచ్చారు ఆర్పీ.