
‘సన్నాఫ్ ఇండియా’ నుండి ‘గాయత్రి’ వరకు కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో ఆయన కెరీర్ ముగిసిందని కొందరు భావించారు. కానీ, తను పట్టిన కత్తికి ఇంకా పదును తగ్గలేదని నిరూపించేందుకు ఆయన మళ్ళీ యుద్ధక్షేత్రంలోకి దూకుతున్నారు. ఈసారి ఆయన వెనుక ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ఉన్నారు. ఆ లెజెండరీ యాక్టర్ మరెవరో కాదు.. మోహన్ బాబు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైలాగ్ డెలివరీకి కొత్త అర్థాన్ని చెప్పిన నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఒకప్పుడు ఏడాదికి డజను సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆయన, గత కొంతకాలంగా వేగం తగ్గించారు. వ్యక్తిగత కారణాలు లేదా వ్యాపార బాధ్యతల వల్ల ఆయన వెండితెరపై కనిపించడం అరుదుగా మారింది. అయితే, ఆయనలోని అసలైన నటుడిని చూడాలని ఆశపడే అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త వినిపిస్తోంది. వరుసగా ఇద్దరు యువ దర్శకులు ఆయనను సరికొత్తగా ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు.
దసరా సినిమాతో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో ‘ప్యారడైజ్’ అనే ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబును ఎవరూ ఊహించని విధంగా, అత్యంత వైలెంట్‌గా చూపించబోతున్నారట. ఒకప్పుడు ‘ఎం ధర్మరాజు ఎంఏ’ వంటి సినిమాల్లో విలక్షణమైన విలనిజాన్ని పండించిన మోహన్ బాబు, ఈ తరానికి తన పవర్ ఏంటో చూపించడానికి సిద్ధమయ్యారు. తొంభై దశకంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే ఆయన శిఖరాగ్రానికి చేరుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ నెగటివ్ రోల్ లో ఆయన కనిపించబోతుండటం విశేషం.
Manchu Mohanbabu In Paradise And Srinivasa Mangapuram
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో కూడా మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతోంది. మోహన్ బాబు వంటి సీనియర్ నటుడిని ఒప్పించడం అంత సులభం కాదు, కానీ శ్రీకాంత్, అజయ్ భూపతి చెప్పిన కథల్లోని బలం చూసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆర్టిస్టుగా ఆయన మళ్ళీ బిజీ అవ్వడం ఖాయం.
మరోవైపు మోహన్ బాబు వారసులు కూడా తమ సినిమాలతో జోరు చూపిస్తున్నారు. మంచు మనోజ్ ‘భైరవం’తో రీ-ఎంట్రీ ఇచ్చి, ‘మిరాయ్’తో సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘డేవిడ్ రెడ్డి’లో బిజీగా ఉన్నారు. ‘కన్నప్ప’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మంచు విష్ణు కూడా రూట్ మార్చి కొత్త జోనర్లను అన్వేషిస్తున్నారు. ‘ప్యారడైజ్’, ‘శ్రీనివాస మంగాపురం’ రెండూ 2026లోనే విడుదల కాబోతుండటంతో, మంచు అభిమానులకు ఇది ఒక మరపురాని ఏడాదిగా మిగిలిపోయే అవకాశం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ తన మార్కు నటనతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం అభిమానులకు పెద్ద పండగే.