
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే.. మరోవైపు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన తన సతీమణి భూమా మౌనిక మంచు, పిల్లలు ధైరవ్, దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మైసూరులోని చాముండి కొండపై కొలువై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మంచు మనోజ్ కుటుంబం.. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించింది. ఆలయానికి చేరుకున్న మనోజ్ దంపతులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అధికారులు మంచు మనోజ్ కుటుంబాన్ని శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా ఆలయానికి రావడంతో అక్కడికి వచ్చిన భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు. పలువురు అభిమానులు మనోజ్‌ను పలకరించడంతో పాటు ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబంతో కలిసి ఆయన ఆలయంలో ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ దాదా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా మైసూరులో ఉన్న ఆయన.. కొంత విరామం దొరకడంతో సతీమణి మౌనిక, పిల్లలతో కలిసి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. దాదాలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌తో పాటు మంచు మనోజ్ పాత్ర కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.