Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

గీతా గోవిందంలోని "ఇంకేమింకేమింకేం కావాలే" పాటకు రూ. 19 లక్షల రాయల్టీ చెక్ వచ్చిందని అనంత శ్రీరామ్ వెల్లడించారు. ఒక పాట 100 మిలియన్ల వ్యూస్ దాటడం తెలుగులో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఆ పాట యూనివర్సల్ అప్పీల్ వల్లే ఇది సాధ్యమైందని, ప్రతి ప్లేకు రాయల్టీ వస్తుందని వివరించారు.

Anantha Sriram: ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది
Anantha Sriram Interview

Updated on: Apr 20, 2026 | 10:44 AM

ప్రఖ్యాత గేయ రచయిత అనంత శ్రీరామ్ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గీతా గోవిందం చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాటకు సంబంధించిన రాయల్టీ, దాని విజయ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాటకు గాను రూ. 19 లక్షల భారీ రాయల్టీ చెక్ అందుకున్నట్లు ఆయన ధృవీకరించారు. అది రెమ్యూనరేషన్ కాదని.. పాట డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ప్లే అయినందుకు ఆ పాట రచయితగా తనకు వచ్చే ప్రత్యేక రాయల్టీ అని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక లిరికల్ వీడియో సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ దాటడం మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. అనంత శ్రీరామ్ తనను తాను “నిర్భయ” అని వర్ణించుకున్నారు. రచయితలకు అభిమానులు ఉంటారని తాను అనుకోను అని,  తన ఉచ్వాసం సంగీతం, నిశ్వాసం సాహిత్యం అని వివరించారు.

ఒక పాట ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడానికి దాని యూనివర్సల్ అప్పీల్ కీలకమని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు. “ఇంకేమింకేమింకేం కావాలే చాలే ఇది చాలే” అనే లైన్, ప్రేమ పాట కోసం రాసినప్పటికీ, వివిధ సందర్భాలకు అది సూట్ అవ్వడంతోనే అది అంతలా వైరల్ అయిందన్నారు. అలాగే, ప్రేమలో విజయం సాధించిన వారు, మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు, ఊహించిన లాభాలు పొందిన వ్యాపారులు – ఇలా ఎవరికైనా ఈ పాట అనుభూతిని ఇస్తుందని వివరించారు.  పాటలకు ఇలాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్నప్పుడు అవి ఎక్కువసార్లు ప్లే అవుతాయి. ఎన్నిసార్లు ప్లే అయితే, అన్ని పావలాలు లేదా 30 పైసల చొప్పున రచయితలకు రాయల్టీ వస్తుందని అనంత శ్రీరామ్ వివరించారు. అలా తెలుగులో అత్యధిక రాయల్టీ వసూలు చేసిన పాటగా ఇంకేమింకేమింకేం కావాలే” నిలిచింది.

Also Read: రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు

Follow Us