టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. బాబు పుట్టిన నాలుగు నెలల తర్వాత తిరిగి మూవీ షూటింగ్లో పాల్గోనేందుకు సిద్ధమయ్యింది. ఈక్రమంలో తిరిగి తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. తాజాగా తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. డెలివరీ తర్వాత శరీరంలో జరిగిన మార్పులు.. తిరిగి తాను షూటింగ్స్ కోసం ఎలా సిద్ధమయ్యింది అనే విషయాలను వివరించింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 మూవీలో కాజల్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు నిలిచిపోయింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనేందుకు తాను గుర్రం స్వారీ చేస్తూ శిక్షణ తీసుకుంటున్నాని.. అయితే గతంలో ఉన్నట్లు ప్రస్తుతం తన శరీరం లేదని.. డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజమని వెల్లడించింది.
” ప్రసవం జరిగిన నాలుగు నెలల తర్వాత నేను తిరిగి షూటింగ్లో జాయిన్ అవుతున్నాను. గతంలో ఉన్నట్లుగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. బాబు పుట్టిన తర్వాత నేను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇటీవలే జిమ్‌కు వెళ్లాను. ముందులా నా శరీరానికి ఎనర్జీ లెవల్స్ పొందడం చాలా కష్టంగా ఉంది. గుర్రపు స్వారీ చేయడం కూడా పెద్ద పనిలా అనిపించింది. గతంలో గుర్రపు స్వారీ సులభంగా చేసాను. మన శరీరం మారవచ్చు. కానీ మన ఆత్మ విశ్వాసం.. అభిరుచి ముందు ఏది కష్టం కాదు. మనం ఎప్పుడూ ముందుచూపుతో ఉండాలి. మనకు కావాల్సినదానిపై దృష్టి పెట్టాలి. మనం ఎంచుకున్న వాటిపై అపరాధ భావంతో ఉండకూడదు.” అంటూ చెప్పుకొచ్చింది.
” ఇండియన్ 2 సినిమాతో మరోసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను కొత్త నైపుణ్యాలు నేర్చుకుని.. వాటిని పాటించేందుకు ప్రయత్నించాను. ఈ చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిరంతరం నేర్చుకుంటునే ఉంటాను. ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.