
సినిమా తీయడం ఒక ఎత్తయితే.. ఆ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం మరో పెద్ద సవాల్. ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి మరింత కష్టం. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, కోట్లాది రూపాయల ప్రమోషన్ క్యాంపెయిన్లు లేకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత సులభం కాదు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి భారీ ప్రచార హంగామా లేకుండానే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. అదే ‘పర్ణశాల’. ఓ విభిన్నమైన ప్రమోషనల్ ఐడియాతో ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వెంకట్ మంచి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్, కామెడీ, సస్పెన్స్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేందుకు చిత్ర బృందం చేసిన ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాలను అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని జిమ్ జిమ్ తార’ పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందనను అందుకుంటూ వైరల్‌గా మారింది. ‘జిమ్ జిమ్ తార’ పాట విషయంలో మేకర్స్ తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను లక్ష్మీదేవితో పాడించడం అనే కాన్సెప్ట్ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది.
సాధారణంగా సినిమా పాటలకు రీచ్ తీసుకురావడానికి భారీగా ప్రమోషన్ చేయడం, సెలబ్రిటీలతో రీల్స్ చేయించడం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహించడం వంటివి చూస్తుంటాం. అయితే పర్ణశాల టీమ్ మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పాటలోని ప్రత్యేకతే దానికి ప్రచారంగా మారడంతో.. పెద్దగా హడావుడి లేకుండానే సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఏదైనా సినిమా పాట వైరల్ కావాలంటే దాని వెనుక భారీ ప్రమోషనల్ బడ్జెట్ ఉండటం సాధారణంగా మారిపోయింది. కానీ ‘జిమ్ జిమ్ తార’ విషయంలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. పాట నచ్చడంతో నెటిజన్లు స్వయంగా దాన్ని షేర్ చేయడం, సోషల్ మీడియాలో చర్చించుకోవడం వల్ల ‘పర్ణశాల’ పేరు కూడా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. దీంతో ఇప్పటివరకు పెద్దగా తెలియని ఈ చిన్న సినిమా ఒక్కసారిగా సినీ ప్రియుల దృష్టిలో పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.