
సిరీస్ రివ్యూ: ఇసకపట్నం
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
కథ: ప్రశాంత్ రగతి
ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బీహెచ్
నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర
ఐశ్వర్య రాజేష్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజీవ్ కనకాల, నరేష్ అగస్త్య, సునీల్ లాంటి స్టార్ క్యాస్ట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది..? ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
తీరప్రాంతమైన ఇసుకపట్నంలో ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న నిష్కల్మష నాయకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల). పొట్టకూటి కోసం అక్కడికి వలస వచ్చిన నాయుడు (సముద్రఖని), చిన్నారావు వద్దే పనిలో చేరి, గంగమ్మ జాతర సాక్షిగా అతడిని మట్టుబెట్టి ఆ ప్రాంతానికి ఏకైక అధిపతిగా ఎదుగుతాడు. అయితే, తండ్రి సాగిస్తున్న ఈ నెత్తుటి రాజకీయాలు నచ్చని ఆయన కుమార్తె భారతి (ఐశ్వర్య రాజేశ్) ఆయనకు ఎదురు తిరిగి ప్రజాసేవలో మునిగిపోతుంది. తనను ఆరాధించే సూరిని (సుధాకర్ కోమాకుల) కాదని ప్రతాప్ వర్మ (రవివర్మ)ను పెళ్లాడిన భారతి, తొలిరాత్రే భర్తను కోల్పోతుంది. చిన్నారావు అడ్డు తొలగాక ఇసుకపట్నాన్ని నాయుడు తన సామ్రాజ్యంగా ఎలా మార్చుకున్నాడు? ఈ మాఫియా అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ అధికారి వర్మ (సునీల్) వేసిన ఎత్తుగడలు ఏమిటి? తండ్రి విధానాలను భారతి ఎందుకు వ్యతిరేకించింది? ఆమె సమాజ సేవ ఏ తీరుగా సాగింది? భర్త ప్రతాప్ వర్మ మరణం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఆటో నడిపే పెద్దన్న (నరేష్ అగస్త్య) ఆశయం నెరవేరిందా? నాయుడికి కుడిభుజంగా మెలిగే కోటయ్య (బెనర్జీ) దారుణ హత్యకు గురికావడానికి గల కారణాలేంటి? తండ్రిని కోల్పోయిన శేఖర్ (రాజా చెంబోలు) ఏ విధంగా స్పందించాడు? అంతిమంగా నాయుడి సామ్రాజ్యం కూలిపోయిందా? భారతి పన్నిన వ్యూహాలు ఫలించాయా? తదితర అంశాల సమాహారమే ఈ వెబ్ సిరీస్ మిగిలిన కథ…
కథనం:
వలస కార్మికుల జీవితాలు, వారిపై సాగే ఆధిపత్య పోరు, వర్గ సంఘర్షణల నేపథ్యంలో తెలుగు తెరపై ఇప్పటికే ఎన్నో కథలు వచ్చాయి. అయితే ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ విషయానికి వస్తే, దర్శకుడు గ్యారీ బి.హెచ్ ఎంచుకున్న ముడిసరుకు పాతదే అయినప్పటికీ, దానిని వెండితెరపై ఆవిష్కరించిన తీరులో ఒక కొత్తదనం, స్వచ్ఛమైన మట్టి వాసన ఉట్టిపడుతుంది. ప్రతి పాత్రకూ ఒక నిర్దిష్టమైన లక్ష్యం, తగినంత ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవడం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ముఖ్యంగా నటీనటుల నుంచి దర్శకుడు రాబట్టుకున్న అద్భుతమైన నటన, కథను నడిపించిన రా అండ్ రస్టిక్ విధానం ప్రేక్షకులకు ఒక అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని కళ్లముందుంచుతాయి. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. ప్రారంభ ఎపిసోడ్లలో దర్శకుడు 1980ల నాటి పరిస్థితులను, ఆనాటి సామాజిక వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఓ సామాన్య కూలీ స్థాయి నుంచి ఒక ప్రాంతాన్ని శాసించే మాఫియా డాన్‌గా నాయుడు పాత్ర ఎదిగిన క్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నెమ్మదిగా కథను నడిపించాడు. అయితే, ఎప్పుడైతే కథ అసలు పాయింట్‌కి చేరుకుంటుందో, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు తలెత్తి, అది పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిన కోల్డ్ వార్‌గా మారుతుందో.. అక్కడి నుంచి స్క్రీన్‌ప్లే ఒక్కసారిగా ఊపందుకుంటుంది.
పారిశ్రామిక ఆధిపత్యం కోసం జరిగే లోపాయికారీ కుట్రలు, వీధుల వెంట సాగే నెత్తురోడే గ్యాంగ్ వార్స్, ఒకరినొకరు చిత్తు చేసుకునేందుకు పన్నే రాజకీయ చదరంగం వంటి సన్నివేశాలు వీక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తాయి. సిరీస్ మధ్యలో చోటుచేసుకునే గ్యాస్ లీకేజీ ప్రమాదం కథను మలుపు తిప్పే కీలక ఘట్టంగా నిలుస్తుంది. ఆ తర్వాత వచ్చే అనూహ్యమైన ట్విస్టులు కథనంపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ద్వితీయార్థంలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని ఎపిసోడ్లలో కథనం కాస్త నెమ్మదించినట్లు, సాగదీతగా అనిపించిన మాట వాస్తవమే. అలాగే కథలో కీలకమైన, బలమైన ప్రభావం చూపే కొన్ని పాత్రలకు పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంపిక చేసుకోవడం వల్ల ఆయా సన్నివేశాలు కాస్త తేలిపోయిన భావన కలుగుతుంది. కానీ, దర్శకుడు తన మేకింగ్ స్కిల్స్‌తో ఆ చిన్న చిన్న లోపాలను కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. ముగింపుకి వచ్చేసరికి, అంటే చివరి మూడు ఎపిసోడ్లలో దర్శకుడు సృష్టించిన హై-వోల్టేజ్ డ్రామా, క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడతాయి. నేరపూరిత వాతావరణం, హింస మోతాదు కొన్ని చోట్ల శృతి మించినట్లు అనిపించినా, కథలోని ఇంటెన్స్ రివెంజ్ డ్రామాను ఎలివేట్ చేయడానికి ఆ మాత్రం వయొలెన్స్ అవసరమేననిపిస్తుంది. పొలిటికల్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్‌ని ఒక రేవు పట్టణ నేపథ్యంలో సమర్థవంతంగా మిళితం చేసి, ఒక ఆసక్తికరమైన కథనంగా మలచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
నటీనటులు:
నాయుడు పాత్రలో సముద్రఖని జీవించేశారని చెప్పాలి. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్త కాకపోయినా, తనదైన శైలిలో సరికొత్త విలనిజాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం అద్భుతం. ఆయన నటన ఈ సిరీస్‌కు వెన్నెముక లాంటిది. ఇక సమాజ శ్రేయస్సు కోసం సొంత తండ్రినే ఎదిరించే కూతురు భారతిగా ఐశ్వర్య రాజేశ్ తీవ్రమైన, ఉద్వేగభరితమైన నటనతో కట్టిపడేసింది. పోలీస్ అధికారిగా సునీల్, ప్రేమికుడిగా సుధాకర్ కోమాకుల, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్య తమ పాత్రల పరిధిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సముద్రఖని వెన్నంటే ఉంటూ ‘హ్యాపీస్’ అనే మేనరిజంతో బెనర్జీ, అలాగే రాజ చెంబోలు పోషించిన పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు.
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీం ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వంశీ పచ్చిపులుసు అందించిన సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉంది. సముద్ర తీర ప్రాంతాలను, జెట్టీలను ఎంతో సహజంగా, రస్టిక్‌గా తన కెమెరాలో బంధించారు. ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను, ఇంటెన్సిటీని అమాంతం పెంచేసింది. మాటలు చాలా చోట్ల పదునుగా ఉండి, సన్నివేశాల లోతును బాగా పెంచాయి. తమడా మీడియా నిర్మాణ విలువలు ఏమాత్రం రాజీ పడకుండా.. సినిమాను తలపించేలా ఉన్నాయి. అయితే కంటెంట్ విషయంలో మేకర్స్ ఇంకాస్త విభిన్నంగా ఆలోచించి ఉంటే, ఇది కచ్చితంగా ఒక అద్భుతమైన రివెంజ్ థ్రిల్లర్‌గా మిగిలిపోయేది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను.. కాస్త సమయం కేటాయించి ఒకేసారి చూస్తే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఇసకపట్నం.. ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్..!