
“నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం” అని తరచు అనే జంధ్యాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈవీవీ సత్యనారాయణ కూడా అదే సూత్రాన్ని అనుసరించారు. అయితే, జంధ్యాలది క్లాస్ జోక్ అయితే, ఈవీవీది మాస్ జోక్. ఆయన పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరులో జన్మించిన ఈయన, చిన్నతనం నుంచే చదువు కంటే సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపేవారు. రోజుకు రెండు సినిమాలు తప్పనిసరిగా చూసేవారు. అందుకే, ఆయన చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. 19 ఏళ్ల వయసులోనే సరస్వతి కుమారితో ఆయన వివాహం జరిగింది. ఆ తర్వాత ఏడాదికోసారి చొప్పున రాజేష్, నరేష్ జన్మించారు. ఈవీవీ చలనచిత్ర రంగప్రవేశం ఓ ఇంటి భాగోతం సినిమాతో అప్రెంటిస్‌గా జరిగింది. ఆ చిత్రానికి నిర్మాత నవతా కృష్ణంరాజు, దర్శకుడు దేవదాస్ కనకాల. ఆ తర్వాత జంధ్యాల దగ్గర చేరి ఎన్నో సినిమాలకు పనిచేశారు. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి కూడా పనిచేశారు, ఆ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడు. 1989లో చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడిగా ప్రారంభమైన ఈవీవీ కెరీర్, 2010లో వచ్చిన కత్తి కాంతారావుతో పూర్తయింది. తన 30 ఏళ్ల కెరీర్‌లో 52 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలి సినిమా అపజయం పాలైనా, రెండో సినిమా ప్రేమ ఖైదీ నుంచి హలో బ్రదర్ వరకు వరుసగా 11 హిట్‌లను ఇచ్చిన ఘనత ఈవీవీది.
తన సినిమాల్లో ఎప్పుడూ హాస్యానికి పెద్దపీట వేసినా, ఆమె వంటి సమస్యాత్మక చిత్రాలతో ఈవీవీ దర్శకుడిగా మరో మెట్టు ఎదిగారని చెప్పాలి. తన సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈవీవీ, అతి తక్కువ కాలంలోనే దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితోనూ ఆయన పనిచేశారు. ప్రారంభంలో ఆయన సినిమా సంభాషణలలో బూతు ధ్వనించినప్పటికీ, ఆ తర్వాత ఆ ముద్రను చెరిపివేసుకొని కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు తీశారు. తన మీద, తన కృషి మీద అంతులేని నమ్మకం ఉండేది ఆయనకు. ఇంటర్ కూడా పాస్ కాని తాను ఈ రంగంలో రాణించాలంటే తన కృషే కారణం అనేవారు. కొత్తవారిని పరిచయం చేయడానికి, ప్రతిభ గలవారిని ప్రోత్సహించడానికి ఈవీవీ ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. రచయితలుగా ఉన్న ఎల్.బి శ్రీరామ్, ఎం.ఎస్ నారాయణ హాస్యనటులుగా పరిశ్రమలో మంచి స్థానం పొందడానికి ఈవీవీ ప్రోత్సాహమే కారణం. పరిశ్రమలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆయన సినిమాల్లో వేషాలు దొరికేవి.
ఈవీవీకి ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్‌లు అభిమాన నటులు. ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాలేదు కానీ, సూర్యవంశం హిందీ చిత్రం అమితాబ్‌తో చేయగలిగారు. పద్మాలయా వారు ఈవీవీ పేరును సిఫార్సు చేసినప్పుడు, తెలుగులో తనకు తెలిసిన నలుగురు ఐదుగురు నిర్మాతలను ఈవీవీ గురించి అడిగి తెలుసుకొని, తాను సంతృప్తి చెందిన తర్వాతే అమితాబ్ అవకాశం ఇచ్చారు. “నాకు ఇంగ్లీష్, హిందీ రాదండి” అని ఈవీవీ అంటే, “నాకు తెలుసు, కానీ మీరు హార్డ్ వర్కర్, అది చాలు నాకు” అని అమితాబ్ అన్నారు. ఆ సినిమాతో బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఈవీవీ. తన సినిమాలకు ఈవీవీ పెట్టే టైటిల్స్ తమాషాగా ఉండేవి. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఆకర్షణీయమైన టైటిల్స్ ముఖ్యమని ఆయన భావించేవారు. జంబలకిడి పంబ, ఆ ఒక్కటి అడక్కు, ఏవండీ ఆవిడ వచ్చింది, బెండ్ అప్పారావు, కత్తి కాంతారావు వంటి టైటిల్స్‌తో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకునిగా తనకు మళ్లీ జన్మను, తన పిల్లలు రాజేష్, నరేష్‌కు ఇచ్చిన రామానాయుడు అంటే ఈవీవీకి ఎంతో గౌరవం.