జైలర్ 2లో ఎవరెవరు కనిపించారో తెలుసా.? ఆ హీరో ఎంట్రీ హైలైట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

జైలర్ 2లో ఎవరెవరు కనిపించారో తెలుసా.? ఆ హీరో ఎంట్రీ హైలైట్
Jailer 2

Updated on: Oct 15, 2026 | 6:36 PM

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కథతో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోల అతిథి పాత్రలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మలయాళం, కన్నడ, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఇందులో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ స్టార్ హీరోలలో కొందరు మొదటి భాగంలోని పాత్రలతోనే కొనసాగగా.. మరికొందరు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ‘జైలర్ 2’లో సందడి చేసిన ఆ స్టార్ హీరోలు ఎవరు.? వారి పాత్రల ప్రత్యేకత ఏమిటి.? ఒక్కసారి చూద్దాం.!

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ‘జైలర్’లో మ్యాథ్యూ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మొదటి భాగంలో కీలకంగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అదే పాత్రలో కనిపించడం ఆకట్టుకుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కూడా ‘జైలర్’లో నరసింహ పాత్రలో కనిపించి అలరించారు. మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్‌కు అండగా నిలిచే పాత్రలో ఆయన కనిపించారు. సీక్వెల్‌లోనూ అదే పాత్రతో తిరిగి తెరపైకి రావడం కన్నడ అభిమానులను ఆకట్టుకునే అంశం.

‘జైలర్ 2’లో అత్యంత ఆసక్తిని రేకెత్తించే అతిథి పాత్రల్లో హృతిక్ రోషన్ ఎంట్రీ ఒకటిగా నిలిచింది. ఆయన రోడీ అనే పాత్రలో కనిపించి మెప్పించారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ఎంట్రీని డిజైన్ చేశాడు దర్శకుడు. దీనికి అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మరింత బలాన్ని చేకూర్చినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించినట్లు సమాచారం. కథలో కాంతాకు సమాచారమందించే వ్యక్తిగా, పోలీసు అధికారిగా ఆయన పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, విజయ్ సేతుపతి వంటి నటుడు సినిమాలో కనిపించడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది.

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ‘జైలర్ 2’లో కామియో పాత్రలో కనిపించినట్లు సమాచారం. ఆయన కామ్‌దేవ్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. మొదటి భాగంతో సంబంధం ఉన్న పాత్రల కొనసాగింపు నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో ఆయన కనిపించడం  ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులను భాగం చేయడం ద్వారా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ స్టార్‌డమ్‌కు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి నటులు తమ పాత పాత్రలను కొనసాగించడం ఒక ప్రత్యేకత కాగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ వంటి నటుల అతిథి పాత్రలు మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us