
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు చాలా మందికి గుండె బరువెక్కినట్లు, నీరసం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే, పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా ఈ రిజెక్షన్ ఒక అడ్డంకిగా కాకుండా, ఒక కొత్త ప్రారంభంగా స్వీకరించాలని సూచిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోదని, అంతకంటే మంచి అవకాశం మీకు రావచ్చని చెప్పారు. తిరస్కరణను ఒక అవకాశంగా భావించడం ముఖ్యం. జీవితంలో విజయం సాధించిన ఎంతో మంది వ్యక్తులు ఒకప్పుడు ఎవరితోనో రిజెక్ట్ కాబడిన వారే. ఒకరి తిరస్కరణ మిమ్మల్ని నిలువరించలేదు, బదులుగా అది మీలో మరింత కసిని పెంచుతుంది. ఆ అనుభవాలను పాఠాలుగా స్వీకరించి ముందుకు సాగాలి. రిజెక్షన్ బాధగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా మనం సహాయం చేసిన వారు తిరస్కరించినప్పుడు, అన్నింటినీ అంగీకరించడం తప్పనిసరి. ఎవరైనా రిజెక్ట్ చేశారన్న బాధ మనల్ని బలహీనపరచకూడదు. బదులుగా, మీలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకొని, వాటిని సరిదిద్దుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.
మీ నైపుణ్యాలు లేదా ప్రతిభ మీ వద్ద ఉన్నంత కాలం ఎవరూ మిమ్మల్ని ఆపలేరని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. రిజెక్ట్ అయిన ప్రతిసారీ మీ ప్రతిభను మరింత పెంచుకోవడం ఎలాగో ఆలోచించండి. దీని కోసం చదువుకోవచ్చు లేదా కష్టపడి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ప్రతి తిరస్కరణ మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా మారేలా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అన్న వాదనకు ఇది పునాది. తిరస్కరణ వల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదు. ముఖ్యంగా, ఎవరైనా మనల్ని కాదంటే ఒంటరితనం అనే భావన కలగవచ్చు. కానీ ఒక్కరు కాదు, వంద మంది కాదన్నా మీరు కుంగిపోకూడదు.
కొంతమంది మిమ్మల్ని అవమానించి మరీ తిరస్కరించినా పట్టించుకోవద్దని ఆయన సూచించారు. ఎందుకంటే ఒక్కోసారి మనలోని శక్తి, సామర్థ్యం మనకే తెలియదు. మనం అనుకున్న దానికంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉండవచ్చు. చరిత్రలో ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. క్రియేటివిటీ లేదని న్యూస్‌పేపర్‌లో పనిచేసే యువకుడిని ఉద్యోగం నుండి తీసేశారు. వాడే వాల్ట్ డిస్నీ అయ్యాడు. హైస్కూల్‌లో సరిగ్గా ఆడటం రాదని బాస్కెట్‌బాల్ టీమ్ నుండి తొలగించబడిన వ్యక్తి మైఖేల్ జోర్డాన్ అయ్యాడు. మాట్లాడటం రాదని, టెలివిజన్‌కు పనికిరాదని చెప్పబడిన అమ్మాయి ఓప్రా విన్‌ఫ్రేగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రియాలోని వియన్నా వీధుల్లో ఆకలితో తిరిగిన ఒక యువకుడి శక్తి అతడికి తెలియదు, కానీ అతడే అడాల్ఫ్ హిట్లర్ అయ్యాడు. కాబట్టి, ఎవరో కాదన్నారని, వద్దన్నారని బాధపడొద్దు. మన గురించి మనకే తెలియదు, ఇతరులకు ఏం తెలుసు” అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..