
తెలుగులో కల్ట్ క్లాసిక్ సినిమాల జాబితా తీస్తే అందులో కచ్చితంగా బొమ్మరిల్లు సినిమా కూడా ఉంటుంది. సుమారు 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. దిల్ రాజు నిర్మాణంలో భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించాడు. జెనీలియా హీరోయిన్ గా చేసింది. 2006 ఆగస్టు 09న విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఓవరాల్ గా రూ. 22 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంటే దాదాపు రూ. 13 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది బొమ్మరిల్లు. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా ఈ సినిమాలో చేసిన నటీనటులకు కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. హీరో సిద్ధార్థ్ కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ మూవీతో జెనీలియా జాతకం పూర్తిగా మారిపోయింది. అందరూ ఆమె పేరు ఒరిజినల్ పేరు మర్చిపోయి హాసిని అని పిలవడం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడరు భాస్కర్. ఇలా ఎంతోమందికి స్పెషల్ మూవీగా నిలిచిన బొమ్మరిల్లును ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసుకున్నారని తెలుసా?
బొమ్మరిల్లు సినిమాకు హీరో గా సిద్ధార్థ్ ఫస్ట్ ఛాయిస్ కాదు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లలో ఎవరో ఒకర్ని ఇందులో నటించడానికి ఒప్పించాలని చూశాడు భాస్కర్. అయితే ఈ సినిమా పట్ల జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పటికే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ కు మరీ ఇంత సాఫ్ట్ కథ సూట్ అవ్వదేమోనని ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అల్లు అర్జున్ కు అయితే ఈ కథ తెగ నచ్చేసింది. అయితే అప్పటికే అతని చేతిలో చాలా సినిమాలు ఉండడంతో బొమ్మరిల్లును చేయలేకపోయాడు. అయితే భాస్కర్ విజన్, టేకింగ్ ను మెచ్చి ఆ వెంటనే పరుగు సినిమాలో అవకాశం ఇచ్చాడు బన్నీ. ఈ విషయం పాతదే అయినా బొమ్మరిల్లు సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.