అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాను ప్రారంభించినందుకు అల్లు కుటుంబానికి, ముఖ్యంగా అల్లు అరవింద్‌కు అభినందనలు తెలిపారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ, తెలుగు సినిమా అభిమానులకు గొప్ప అనుభూతిని అందిస్తున్నారని కొనియాడారు.
హైదరాబాద్ లోని కోకాపేటలో అల్లు సినిమాస్ ను గ్రాండ్ గా ప్రారంభించింది అల్లు అరవింద్ ఫ్యామిలీ. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ను ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాను ప్రారంభించినందుకు అల్లు కుటుంబానికి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ కు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అల్లు రామలింగయ్య గొప్ప వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారని, తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారని కొనియాడారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం హైదరాబాద్ నగరానికి, సినిమా పరిశ్రమకు గొప్ప గుర్తింపు తెస్తుందని అన్నారు.
తనను తాను సినిమా అభిమానిగా అభివర్ణించుకున్న సీఎం, సినిమా ఎలా అభివృద్ధి చెందుతుందో గుర్తుచేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నో కలర్స్, ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, డాల్బీ, విఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక ఆవిష్కరణలతో మన దేశంలో సినిమా వేగంగా అభివృద్ధి చెందిందని సీఎం పేర్కొన్నారు. బాహుబలి, కల్కి, అరుంధతి వంటి డిజిటల్ సౌండ్‌తో కూడిన సాంకేతిక నిపుణతతో కూడిన సినిమాలు తీసినప్పటికీ, వాటిని ప్రదర్శించడానికి తగిన థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం నిరుపయోగంగా మారుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ డాల్బీ థియేటర్ 500-700 సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తుందని, ఇది పెద్ద స్క్రీన్‌లపై ఎక్కువ మందితో సినిమా చూసిన పాత అనుభూతిని తిరిగి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా భవిష్యత్తులో అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాకుండా, హాలీవుడ్‌లో కూడా రాణించాలని, అక్కడికి కూడా మన సినిమా రీచ్ అవ్వాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
