
ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే మనసుకు ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనకు బాగా తెలిసిన వాడు అన్న భావన కలుగుతుంది. చిన్న వయసులోనే ఎంతో స్టార్ డమ్ సంపాదించి స్టార్ హీరో కావాల్సిన వాడు ఎవరూ అనుకోని విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ అతను చనిపోయి సుమారు 12 ఏళ్ల గడిచిపోయాయి. అయినా ఈ పేరు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. టీవీలో ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వస్తుంటే మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటాయి. అలాగే ఉదయ్ కిరణ్ స్నేహితులు, అతనితో కలిసి పని చేసిన నటీనటులు, కమెడియన్లు ఇప్పటికీ ఈ టాలీవుడ్ లవర్ బాయ్ ను తరచూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉదయ్ కిరణ్ ఎదిగిన తీరు, అతను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఏం జరిగిందో బయట పెట్టారు.
‘చిన్న వయసులోనే ఉదయ్ కిరణ్ చాలా క్రేజ్ సొంతం చేసుకున్నారు. నేను అతని పక్కనే స్వయంగా ఉండి అతని విజయాలను చూశాను. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఉదయ్. హ్యాట్రిక్ హీరోగా మన్ననలు అందుకున్నాడు. ఒకసారి బీచ్ లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి ఉదయ్ పై పూలు చల్లేవారు. అసలు షూటింగ్ చేయనిచ్చేవారు కాదు. సోషల్ మీడియా లేని టైమ్ లోనే అతను ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఒక ఈవెంట్ కు వెళ్లాను. ఉదయ్ కిరణ్ కూడా అక్కడకు వచ్చాడు. కానీ అక్కడ ఓ సెలబ్రిటీకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ట్రీట్మెంట్ కానీ ఉదయ్ కిరణ్ కు ఇవ్వలేదు. జస్ట్..బీకాజ్ ఆఫ్ అతను అప్పటికీ ఫేమ్ లో లేడు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి అతనిని ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో అప్పుడప్పుడే వచ్చిన హీరోలతో అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడాన్ని చూసి చాలా బాధేసింది’
‘ఇక ఉదయ్ కిరణ్ చనిపోయాడన్న వార్త వినగానే నేను షాక్ అయ్యాను. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాను. కానీ అక్కడ మమ్మల్ని ఎవరూ లోనికి పంపలేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఉదయ్ కిరణ్ ను చూడడానికి రాలేదు. కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. చివరకు ఎలాగోలా ఆస్పత్రిలోకి వెళ్లాను . అప్పుడు మార్చురీలో ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నేనే. అప్పటికే అతని కళ్లను దానం చేసి ప్లాస్టిక్ కళ్లు అమర్చారు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లతో మాట్లాడి బాడీని ఇంటికి తీసుకెళ్లాను. ఆ తర్వాతి రోజు ఉదయం ఛాంబర్ దగ్గరకు తీసుకెళితే అప్పుడు ఆర్టిస్టులందరూ వచ్చారు. ఇక శ్మశానంలో కూడా ఉదయ్ కిరణ్ ఆఖరి కట్టే కాలే వరకు అక్కడే ఉన్నాను. ఒక మంచి స్నేహితుడికి అంతకన్నా ఏమివ్వగలం’ అని ఎమోషనల్ అయ్యారీ బిగ్ బాస్ కౌశల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి