
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న ‘బిగ్ బాస్ తెలుగు 10’ రియాలిటీ షో క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. ఫినాలే రేసు సమీపిస్తున్న కొద్దీ హౌస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 12వ వారం నిర్వాహకులు ప్రేక్షకులకు డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత వారం కేవలం ఒక్కరినే ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్, ఈసారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారు. 12వ వారం నామినేషన్స్‌లో త్రిగుణ్, ముఖేష్ గౌడ, ఆటో రామ్ ప్రసాద్, దేబ్జానీ మోదక్, రామకృష్ణ, టెంపర్ వంశీ, వర్షిణి సౌందరరాజన్ నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్ గమనిస్తే.. త్రిగుణ్, ముఖేష్ గౌడ భారీ ఓట్లతో టాప్ పొజిషన్లలో నిలిచి ముందుగానే సేఫ్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ రామ్ ప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీ మోదక్ ఓ మోస్తరు ఓట్లతో సేఫ్ జోన్లోకి చేరుకున్నారు. చివరి స్థానాలలో మిగిలిన టెంపర్ వంశీ, వర్షిణి డేంజర్ జోన్లో పడ్డారు.
శనివారం (నవంబర్ 28) వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటింగ్‌లో అందరికంటే తక్కువ ఓట్లు రావడంతో టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. స్టేజీపైకి వచ్చిన తర్వాత ఆయన ఏమాత్రం ఎమోషనల్ కాకుండా, తన 12 వారాల జర్నీ వీడియోను చూసి సంతోషించారు. వీడ్కోలు పలుకుతూ.. “ఎలాగైనా కప్పు కొట్టాలి” అని త్రిగుణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ ప్లాన్‌లో భాగంగా వంశీ తర్వాత యాంకర్ వర్షిణి సౌందరరాజన్ కూడా ఇంటిబాట పట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఆదివారం (నవంబర్ 29) ఎపిసోడ్ షూటింగ్లో వర్షిణి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసినట్లు సమాచారం. అయితే, నేటి ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయితేనే దీనిపై అధికారిక స్పష్టత రానుంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సీజన్ 10లోకి అడుగుపెట్టిన టెంపర్ వంశీ, తనదైన శైలిలో ఆడుతూ ఏకంగా 12 వారాల పాటు హౌస్‌లో కొనసాగారు. గతంలో ఒకట్రెండు సార్లు ఎలిమినేషన్ అంచుకు వెళ్లి అదృష్టం కొద్దీ బయటపడ్డారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు వంశీ వారానికి రూ. 2 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. ఈ లెక్కన 12 వారాలకు గాను ఆయన మొత్తంగా రూ. 24 లక్షల భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి