
ఇండియన్ సినీ సంగీత చరిత్రలో రాక్‌స్టార్ ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్. ఆ ఆల్బమ్‌లోని ప్రతి పాట ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులలో మారుమోగుతూనే ఉంటుంది. అయితే, అటువంటి కల్ట్ మ్యూజిక్ అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు, ఆ సినిమా విడుదలైన 8 నెలల వరకు నిర్మాత ఒక్క రూపాయి కూడా పారితోషికం ఇవ్వలేదంటే నమ్మగలరా ? తాజాగా జరిగిన ‘డెహ్రాడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ 8వ ఎడిషన్‌లో దర్శకుడు ఇంతియాజ్ అలీతో కలిసి పాల్గొన్న రెహమాన్, తమ 15 ఏళ్ల ప్రయాణంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాక్‌స్టార్ మేకింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఏఆర్ రెహమాన్ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా పాటలు నిర్మాతకు ఏమాత్రం నచ్చలేదని, అందుకే పేమెంట్ ఆపేశారని తెలిపారు. రాక్‌స్టార్ సినిమా మొత్తానికి నిర్మాత నాకు డబ్బులు ఇవ్వలేదు. ‘నాకు ఈ సంగీతం నచ్చలేదు’ అని ఆయన ముఖం మీదే చెప్పారు. ఆ సమయంలో నా ప్రయాణ ఖర్చులతో పాటు సంగీతకారుల పారితోషికాలను నేనే జేబులోంచి చెల్లించాను. కనీసం ఒక్క పైసా కూడా అందలేదన్న విషయాన్ని నేను దర్శకుడు ఇంతియాజ్ అలీకి కూడా చెప్పలేదు” అని రెహమాన్ వివరించారు. ఎట్టకేలకు సినిమా రిలీజై హిట్ అయిన 8 నెలల తర్వాత నిర్మాత తనకు చెక్కు ఇచ్చారని ఆయన వెల్లడించారు.
‘రాక్‌స్టార్’ మొదలయ్యే సమయంలో రెహమాన్, ఇంతియాజ్ అలీ మధ్య పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇద్దరూ కాంటాక్ట్ అవ్వలేక, అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు. రెహమాన్‌కు ఈ సినిమా చేయడం ఇష్టం లేకనే సైలెంట్‌గా ఉన్నారని ఇంతియాజ్ అలీ భావించారు. కానీ అప్పటికే రెహమాన్ రెండు పాటలు పూర్తి చేసి, మరో మూడు ట్యూన్స్ సిద్ధం చేసుకున్నారు. ఈ గందరగోళానికి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గాలో తెరపడింది. షూటింగ్ లొకేషన్ల కోసం వెళ్లిన ఇంతియాజ్ అలీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు, దర్గా నిర్వాహకుల ద్వారా ఒక ఆసక్తికర విషయం తెలిసింది. రెహమాన్ ఆ దర్గా నేపథ్యంలో ఒక పాట కంపోజ్ చేస్తున్నారని వారు చెప్పారు. కథలో దర్గాకు కీలక ప్రాధాన్యత ఉండటంతో, రెహమాన్ తమ సినిమా కోసమే పనిచేస్తున్నారని ఇంతియాజ్ అలీకి అర్థమైంది. వెంటనే రెహమాన్‌కు ఫోన్ చేయగా, “అవును, మనం ఈ సినిమా చేస్తున్నాం కదా! ఇప్పటికే మూడు పాటలు కూడా రెడీ చేశాను” అని చెప్పడంతో ఇంతియాజ్ ఊపిరి పీల్చుకున్నారు.
‘రాక్‌స్టార్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో మ్యూజికల్ హిట్ ‘హైవే’ . ఈ సినిమాకు ముందుగా కేవలం ఒక్క పాట మాత్రమే ఉంటుందని ఇంతియాజ్ అలీ అనుకున్నారు.”రాక్‌స్టార్ తర్వాత రెహమాన్ నాకు స్కైప్‌లో కాల్ చేసి కొత్త సినిమా గురించి అడిగారు. ‘సర్, ఇందులో ఒకే ఒక్క పాట ఉంది’ అని చెప్పాను. ‘పర్వాలేదు, కథ చెప్పు’ అన్నారు. అలా మొదలైన ప్రయాణంలో ఒక పాట కాస్తా ఏకంగా 14 పాటలకు చేరింది. ఇప్పుడు రాక్‌స్టార్ కంటే హైవేలోనే ఎక్కువ పాటలు ఉన్నాయి” అని ఇంతియాజ్ అలీ చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వులు విరిశాయి. 1995లో మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ విషయంలోనూ ఇలాగే జరిగిందని రెహమాన్ గుర్తుచేశారు. కేవలం 20 రోజుల్లో పాటల్లేని డాక్యుమెంటరీ తరహా చిత్రంగా తీయాలనుకున్న ‘బొంబాయి’లో చివరకు 5 అద్భుతమైన పాటలు చేరాయని తెలిపారు. సంగీతంలో ఏ పాట ఎప్పుడు హిట్ అవుతుందో అంచనా వేయలేమని రెహమాన్ అన్నారు. ‘రాక్‌స్టార్’లోని ‘షహర్ మే హూన్ మై తేరే’ పాటను తాము అంతగా ఇష్టపడలేదని చెప్పారు. “మేము చాలా సాధారణంగా, మాకు అంతగా నచ్చని విధంగా చేసిన ఆ పాటే సూపర్ హిట్ అయ్యింది. యూఏఈలో ఏకంగా నాలుగు నెలల పాటు ఆ పాట నంబర్ వన్ స్థానంలో నిలిచింది” అని రెహమాన్ నవ్వుతూ చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి