
సీనియర్ హీరోయిన్ మీనా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేశారు. ప్రస్తుతం మీనా సినిమాల స్పీడ్ తగ్గించేశారు. అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. మీనా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. తమిళ్ తోపాటు తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న మీనా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ హీరోలందరిలోనూ తనకు వెంకటేష్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయనతో పనిచేయడం అత్యంత సౌకర్యంగా ఉండేదని మీనా వెల్లడించారు. ఆయనతోనే ఎక్కువ విజయవంతమైన చిత్రాలు చేసినట్లు ఆమె తెలిపారు.
చంటి, సుందరకాండ వంటి చిత్రాల సమయంలో తాను చాలా సైలెంట్ గా, కొత్తగా ఉండేదాన్నని, వెంకటేష్‌తో సహా చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు కూడా ప్రశాంతంగా ఉండేవారని మీనా గుర్తు చేసుకున్నారు. మొదటి రెండు, మూడు చిత్రాలలో తాను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదని, ఆతర్వాత వారితో, వారి కుటుంబాలతో స్నేహాన్ని పెంచుకున్నానని ఆమె వివరించారు. అయితే, బాలకృష్ణ మాత్రం కొంచెం భిన్నమని, తాను మాట్లాడకపోయినా ఆయనే తనతో సంభాషణలు మొదలుపెట్టి మాట్లాడించేవారని మీనా పేర్కొన్నారు. మోహన్ బాబుతో తన తొలి అనుభవం ప్రత్యేకమైనదని, “అల్లరి మొగుడు” సినిమా సమయంలో ఆయన బెదిరించినట్లు అనిపించినా, అది కేవలం సరదాకే అని తర్వాత తెలిసనదని మీనా అన్నారు. అప్పట్లో తాను చాలా చిన్న వయస్సులో ఉండటం, తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆయన మాటల అర్థం తెలియలేదని ఆమె వివరించారు. మోహన్ బాబు పిల్లలు లక్ష్మి, విష్ణులతో షూటింగ్ సమయంలో అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్స్ వంటి ఆటలు ఆడేదాన్ని అని తెలిపారు. తర్వాత ఆయన నిజంగా చాలా మంచి వ్యక్తి అని అర్థమైందని ఆమె గుర్తు చేసుకున్నారు.
తన సినీ జీవితంలో అల్లరి, కొంటె పాత్రలు, సెంటిమెంటల్ పాత్రలు రెండూ చేసినప్పటికీ, కొంటె పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపానని మీనా తెలిపారు. అది తనలోని అల్లరితనాన్ని బయటపెట్టడానికి ఒక అవకాశంలా భావించానని ఆమె వివరించారు. పరిశ్రమలో సంబంధాలపై మాట్లాడుతూ, తాను చాలా చిన్న వయస్సులో ఉండటం వల్ల ప్రేమ, సంబంధాల గురించి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని, ఈ విషయంలో తాను “సాధారణ విద్యార్థిని” అని మీనా అన్నారు. తన వృత్తి నైపుణ్యమే తన అతి పెద్ద బలం అని, తన వృత్తి నైపుణ్యమే మోహన్ బాబు లాంటి వారి నుండి కూడా గౌరవాన్ని సంపాదించిందని మీనా చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.