
టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వుతూ కనిపించే నటీమణుల జీవితాలు ఎప్పుడూ పూలబాటలు కావు. నటి జయలలిత జీవిత కథ వింటే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమెకు, పురుషాధిక్య ప్రపంచం ఆదిలోనే సవాళ్లు విసిరింది. అవకాశాల కోసం కొన్నిసార్లు అయిష్టంగానే రాజీ పడాల్సి వచ్చిందని, ఒక దర్శకుడిని కాదన్నందుకు తన పాత్రనే తీసివేసిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అవుట్ డోర్ షూట్స్‌కు వెళ్లినప్పుడు ఓ పెద్ద ఆర్టిస్ట్ రాత్రి తలుపులు కొట్టి.. తీయమని చెప్పాడని ఆమె తెలిపారు. “కాపాడుకున్నాను అంటే కాపాడుకోలేదనే చెప్పాలి” అన్న ఆమె మాటలు ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
క్రాస్ బెల్ట్ మణి అనే వ్యక్తి నుంచి తనను కాపాడిన ఒక మలయాళ దర్శకుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఎదిరించి మరీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆర్థిక ఇబ్బందులు, భర్త విలాసాలు ఆమె కష్టార్జితాన్ని హారతి కర్పూరం చేశాయి. ఆస్తి కోసం పిల్లలను కనాలని ఒత్తిడి చేసినా, తన భవిష్యత్తుపై నమ్మకం లేక రహస్యంగా గర్భం రాకుండా జాగ్రత్త పడ్డారంటే ఆమె ఎంతటి మానసిక క్షోభ అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.
క్రమంగా వారిద్దరి మధ్య గొడవలు పెరిగి, శారీరక దాడులు జరగడమే కాకుండా ఒకానొక దశలో ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం జరిగింది. అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నప్పుడు ఒక బాబా రూపంలో దైవం ఆమెను కాపాడటం, ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు లాంటి పెద్దల సహకారంతో పోలీసులకు చెప్పడం లాంటివి జరిగాయి. తనను కాపాడతాడనుకున్న వ్యక్తే కసాయిగా మారినా, దైవ సంకల్పం వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆమె పేర్కొన్నారు.
Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!